తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే కృష్ణా నదిలో పురాతన దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. హిందూ దేవుళ్ల  విగ్రహాలను పల్నాడు జిల్లాకు చెందిన ప్రజలు కృష్ణా నదిలో గుర్తించారు. 

పల్నాడు : నదీగర్భంలో పురాతన దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే కృష్ణా నదిలో పురాతన విగ్రహాలను గుర్తించిన స్థానికులు ఒడ్డుకు చేర్చారు. ఈ హిందూ దేవుళ్ల విగ్రహాలను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. 

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అంబడిపూడి సమీపంలోని కృష్ణా నదిలో పురాతన విష్ణుమూర్తితో పాటు శివలింగం, రెండు నంది విగ్రహాలు బయటపడ్డాయి. కృష్ణా నది వద్దకు వెళ్ళిన గ్రామస్తులు విగ్రహాలను చూసి వెంటనే వాటికి ఒడ్డుకు చేర్చారు. రక్షిత మంచినీటి పథకం కాలువ వద్దకు చేర్చిన ఈ విగ్రహాలను తిలకించెందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. 

అయితే ఈ విగ్రహాలు ఎక్కడినుండయినా కొట్టుకువచ్చి అంబడిపేట వద్ద ఒడ్డుకు చేరాయా? లేదంటే ఇసుకకోసం నదిలో తవ్వకాలు చేపట్టగా అడుగున వున్న విగ్రహాలు బయటపడ్డాయా? అన్నది తెలియాల్సి వుంది. గ్రామస్తుల నుండి సమాచారం అందుకున్న అధికారులు కూడా విగ్రహాలను పరిశీలించారు. ఈ విగ్రహాలను పురావస్తు అధికారులు స్వాధీనం చేసుకుని వాటి చరిత్ర గురించి తెలుసుకోనున్నారు. 

వీడియో

ఇదిలావుంటే ఇటీవల తాడేపల్లి మండలం సీతానగరం వద్ద కృష్ణానది ఒడ్డున భారీగా నాగ ప్రతిమలు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ విగ్రహాలు కూడా ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? అనేది తెలియలేదు. ఎవరైనా తీసుకువచ్చి పెట్టారా లేక నదిలో కొట్టుకువచ్చాయా అనేది తెలీయడంలేదని సీతానగరం వాసులు అంటున్నారు. 

 కృష్ణా నదిలో బయటపడుతున్న విగ్రహాలు పురాతన కాలానికి చెందినవేమో లేదంటే ఎక్కడయినా గుడులు కూల్చివేసి ఈ విగ్రహాలకు ఇక్కడ తెచ్చి పడేసారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేదంటే ఎవరైనా శిల్పులు డ్యామేజ్ విగ్రహాలను తెచ్చి పడేసారేమోనని మరికొందరు అంటున్నారు. ఎలావస్తున్నాయో తెలీదుగానీ ఇటీవల కృష్ణానదీ తీరంతో విగ్రహాలు బయటపడుతున్నాయి.