కృష్ణా జిల్లాలో సూసైడ్ చేసుకొన్న యాంకర్ తేజశ్విని కేసులో ఆమె భర్త పవన్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె సూసైడ్ నోట్ ఆధారంగా పవన్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..  గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన తేజస్విని (26) ఐదేళ్ల క్రితం మట్టపల్లి పవన్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. తేజస్విని విజయవాడలోని ఓ ప్రైవేటు చానల్‌లో న్యూస్‌ రీడర్‌గానూ, పవన్‌కుమార్‌ ఉయ్యూరులోని బజాజ్‌ రిలయన్స్‌లో పనిచేస్తున్నారు. 

ఈనెల 16వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో ఈడుపుగల్లులోని ఎంబీఎంఆర్‌ కాలనీలోని అద్దె ఇంట్లో ఉరివేసుకుని తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అర్థరాత్రి సమయంలో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

దర్యాప్తులో భాగంగా ఇంట్లో తనిఖీలు జరిపిన పోలీసులకు తేజశ్విని రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. మారుతానని ఎదురుచూసి మోసపోయినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో 498ఎ, 306 సెక్షన్‌ల కింద కేసులో మార్పులు చేసి తేజశ్విని భర్త పవన్ ని అరెస్ట్ చేశారు.