యాంకర్ శ్యామల.. తన టీవీ షోల ద్వారా ఇంటింటికీ చేరువయ్యారు.  ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ షో ముగిసిన తర్వాత.. సరిగ్గా ఎన్నికల సమయంలో ఆమె వైసీపీలో చేరారు. ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.

ఆ ఎన్నికల సమయంలో ఆమె వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారాలు కూడా బాగానే చేశారు. తర్వాత ఆ పార్టీ విజయం సాధించడం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో ఎక్కువ హడావిడి చేసిన శ్యామల.. తర్వాత అసలు పార్టీలో ఎక్కడా చురుకుగా కనపడినట్లు ఎక్కడా కనపడలేదు. దీంతో ఆమె పార్టీకి దూరమయ్యారా అనే అనుమానాలు అందరికీ కలిగాయి.

కాగా.. ఈ అనుమానాలపై తాజాగా ఆమె స్పందించారు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని గడుపుతుండగా.. ఆ సమయంలోనే రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. తాను వైసీపీ నేతలు పిలిస్తేనే వెళ్లి ఆ పార్టీలో చేరానని చెప్పారు. తాను ఇప్పటికీ అదే పార్టీలో ఉన్నానని.. దూరం కాలేదని క్లారిటీ ఇచ్చారు.

‘మనకంటే ముందు జాయిన్ అయిన వాళ్లు, మనకంటే అనుభవం ఉన్నవాళ్లు పార్టీలో చాలా మంది ఉన్నారు. నేను ఆ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యా అంటే.. ఎన్నికల ముందు నన్ను ప్రచారానికి పిలిచారు. అయితే వైసీపీ ఫ్యామిలీలో ఒక పార్టీ‌గా ఉండి ప్రచారం చేయాలనుకున్నాను.. ఏదో వాళ్లు పిలిచారు కాబట్టి ప్రచారం చేసి వచ్చేద్దాం అని అనుకోలేదు అందుకే పార్టీలో చేరా. నాకు వైఎస్ఆర్ అంటే చాలా ఇష్టం. అలాగే జగన్ గారు అంటే ఇంకా అభిమానం. అందుకే ఆయనతో కలిసి పనిచేయడానికి ఒక ఛాన్స్ వస్తే మిస్ చేసుకోకూడదనుకున్నా అందుకే ఆ పార్టీలోలో జాయిన్ అయ్యా.


అయితే పార్టీకి నేను దూరం కాలేదు.. నేను చేయాల్సింది నేను చేస్తున్నా.. దాన్ని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. జగన్ అనే వ్యక్తి ఒకసారి మాట ఇచ్చారంటే.. ఖచ్చితంగా చేసి తీరతారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఈ ఏడాది పాలనలో ఆయన చేస్తానన్నవి 90 శాతం చేసి చూపించారు. నాయకుడిగా మంచి పేరు సంపాదించారు. ఆపదలో ఉన్న వారికి ధైర్యం ఇస్తున్నారు.

జగన్ ఒక్క ఏడాదిలోనే ఇంత చేస్తే 4 ఏళ్లలో ఇంకెంత చేస్తారని వెయిట్ చేస్తున్నా. జగన్ గారు సీఎం అయిన తరువాత వెళ్లి కలిసింది లేదు. అవసరం రాలేదు. అంత పెద్ద వాళ్లను కారణం లేకుండా డిస్ట్రబ్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన చాలా బిజీగా ఉన్నారు. నాకు ఏదైనా అవసరం వస్తే.. ఆయన తప్ప ఇంకెవరివల్లా కాదు అంటే తప్పకుండా వెళ్లి కలుస్తా. వైసీపీలో ఎలాంటి పదవిని ఆశించలేదు. పదవులు చేయడానికి నాకు అసలు అనుభవమే లేదు’ అంటూ చెప్పుకొచ్చారు యాంకర్ శ్యామల.