ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడిన క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.సుంకర ప్రసాద్ నాయుడిపై 11 కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడిన క్రిమినల్ Sunkara Prasad Naidu ను ఆదివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసాద్ నాయుడిపై 11 కేసులు నమోదయ్యాయి.ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గుంతకల్లు వ్యాపారి కిడ్నాప్ కేసు విచారణ సమయంలో సుంకర ప్రసాద్ నేరాలు బయటపడ్డాయని అనంతపురం పోలీసులు ప్రకటించారు.
గుంతకల్లుకు చెందిన వ్యాపారి ఆకుల వెంకటేష్ ను సుంకర ప్రసాద్ ముఠా కిడ్నాప్ చేసి కోటి రూపాయాలు డిమాండ్ చేసిందని పోలీసులు తెలిపారు. అయితే కోటి రూపాయాలు ఇవ్వలేమని రూ. 25 లక్షలు ఇస్తామని వెంకటేష్ కుటుంబ సభ్యులు నిందితులకు చెప్పారు. అయితే సుంకర ప్రసాద్ నాయుడు ముఠా సభ్యులు Akula Venkatesh కుటుంబం నుండి రూ . 25 లక్షలు తీసుకొంటున్న సమయంలో అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు వివరించారు.
ఆకుల వెంకటేష్ కొడుకు ఈ విషయమై తమకు సమాచారం ఇవ్వడంతో గుంతకల్లు డీఎస్పీ నేతృత్వంలోని పోలీసుల బృందం ప్రసాద్ నాయుడు ముఠాను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. సుంకర ప్రసాద్ సహా 13 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. ఈ విషయంలో తమకు హైద్రాబాద్, మహబూబ్ నగర్ పోలీసులు కూడా సహకరించారని అనంతపురం పోలీసులు తెలిపారు. సుంకర ప్రసాదనాయుడి వద్ద నుండి ఒక తుపాకీతో పాటు బుల్లెట్లను కూడా సీజ్ చేసుకొన్నట్టుగా పోలీసులు తెలిపారు.
