అనంతపురం: ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు. కూతురే తన ప్రపంచంగా బతుకుతున్నాడు. చిన్నప్పుడు గుండెలమీద ఎత్తుకుని పెంచి పెద్ద చేశాడు. ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. గుండెలు మీద ఎత్తుకుని పెంచిన కూతురు గుండెలపై తన్నింది. తండ్రి ప్రేమ కంటే తాను ప్రేమించిన వాడి ప్రేమే గొప్పదంటూ వెళ్లిపోయింది. 

దీంతో కూతురు ఏమై పోతుందోనన్న భయం ఒకవైపు పరువుపోతుందని మరోవైపు ఇలా ఆ తండ్రి మనోవేదనకు గురయ్యాడు. కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు ఇలా ప్రేమ పేరుతో వెళ్లిపోవడంతో భరించలేక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురిపై కన్న తండ్రి ప్రేమకు పరాకాష్టగా నిలిచిన ఈ హృదయ విదారకర ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ కు చెందిన ఎస్ భరత్ కుమార్ గత 20ఏళ్ల క్రితం అనంతపురం వచ్చి స్థిరపడ్డాడు. అనంతపురంలో రూపాలి గిఫ్ట్స్, నావెల్టీస్ దుకాణం నిర్వహిస్తూ మంచి వ్యాపారవేత్తగా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. భరత్ కుమార్ కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ఇటీవలే ఘనంగా వివాహం జరిపించాడు. చిన్న కుమార్తె బెంగుళూరులో ఆర్కిటెక్ కోర్సు చదువుతోంది. 


బెంగుళూరులో చదువుకుంటున్న ఆమెకు బెంగాలీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆపరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ వారిద్దరి పెళ్లికి దారి తీసింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఆ జంట వివాహం చేసుకున్నారు. దసరా పండుగకు అనంతపురం వచ్చిన చిన్న కుమార్తె కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపింది. పండుగ ముగిసిన తర్వాత శుక్రవారం బెంగుళూరుకు బయలుదేరింది. 

బెంగుళూరుకు వెళ్తూ తన ప్రేమ వివాహ విషయాన్ని తండ్రికి మెసేజ్ చేసింది. నాకోసం ఎక్కడా వెతకొద్దు..ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో వెళ్లిపోతున్నా అంటూ తండ్రికి మెసేజ్ పెట్టింది. కుమార్తె మెసేజ్ చదివిన భరత్ కుమార్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఒక్కసారిగా పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో భరత్ కు గుండె ఆగినంత పనైంది.  

కూతురు ప్రేమ వివాహంతో మానసికంగా కృంగిపోయాడు. భరత్ పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అసలు విషయం చెప్పగా వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం బంధువులకు తెలిస్తే తన పరువు ఏం కావాలని వారంతా కృంగిపోయారు. కుటుంబ సభ్యుల్లో తన పరువు మంటకలిపిందని ఆవేదనకు గురయ్యాడు.  

కుమార్తె ఆచూకీ తెలుసుకుందామని అదేరోజు శుక్రవారం మధ్యాహ్నం పోలీసులను ఆశ్రయించారు. సెల్ నంబర్ ఆధారంగా ఆ యువతి ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో మరింత క్షోభకు గురయ్యాడు. ఆ రాత్రంతా కూతుర్ని తలుచుకుంటూనే గడిపాడు. తెల్లవారగానే ఎవరికీ మోహం చూపించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.  

అలా వెళ్లిపోయిన భరత్ కుమార్ శనివారం ఉదయం 9 గంటల సమయంలో అనంతపురం నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్లదిన్నెసమీపంలో రైలు పట్టాలపై మాంసపు ముద్దగా కనిపించాడు. అటుగా వెళ్తున్న రైల్వే గ్యాంగ్‌మెన్‌ రైల్వేపట్టాల పై విసిరేసినట్లున్న మాంసపు ముద్దలను గుర్తించాడు. ఎవరో వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించాడు. ఈ విషయాన్ని అనంతపురం రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు.
 
సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే మృతదేహం వద్ద లభించిన కొన్ని ఆధారాలు ఆధారంగా ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి అనంతపురం నగరంలోని రూపాలి నా వాల్టీస్‌ దుకాణం నిర్వహకుడు రాజస్థాన్‌ వాసి భరత్‌కుమార్‌గా గుర్తించారు. 

భరత్ కుమార్ ఆత్మహత్య విషయాన్ని కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు చేరవేశారు. మృతుడి కుటుంబ సభ్యులతో పాటు రాజస్థాన్ కు చెందిన తోటి వ్యాపారులు, బంధువులు, మిత్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హృదయ విదారకంగా పడిఉన్న మాంసపు ముద్దలను చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. 

ఎంతటి ఘోరమంటూ నిట్టూర్చారు. పగవాడికికూడా ఇలాంటి చావు రాకూడదని భగవంతుడిని వేడుకున్నారు. అనంతరం భరత్‌ మృతదేహపు మాంసపు ముద్దలను సంచిలో వేసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 
చిన్న కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం వల్లనే పరువు పోయిందన్న మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. కుమార్తె వల్లే ఆత్మహత్యకు పాల్పడితే ఇది పరువు ఆత్మహత్య అని ఆరోపించారు.  

అయితే కుటుంబ సభ్యులు మాత్రం భరత్ కుమార్ ఆత్మహత్యపై వేరేలా స్పందిస్తున్నారు. భరత్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్తున్నారు. గార్లదిన్నె ప్రాంతంలో భూమి కొనుగోలుకు శనివారం ఉదయం వెళ్లాడని అక్కడ ఏం జరిగిందో తెలియదని ఇలా శవమై కనిపించారని బోరున విలపిస్తున్నారు. అయితే భరత్ కుమార్ ది పరువు ఆత్మహత్య లేక హత్య అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.