అనంతపురం: కోరనా వైరస్ మహమ్మారి కుమారుడిని కడసారి చూసుకోవడానికి కూడా తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వలేదు. హైదరాబదులో మరణించిన తన కుమారుడి శవాన్ని గ్రామంలోకి అనుతించడానికి స్థానికులు నిరాకరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రవెల్లి గ్రామానికి చెందిన సుంకన్న భార్యాపిల్లలతో హైదరాబాదులో నివాసం ఉంటూ వచ్చాడు. 

సుంకన్నకు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తీసుకుని వెళ్తుండగా అతను తుదిశ్వాస విడిచాడు. దాంతో భార్య అతని శవాన్ని స్వగ్రామానికి తీసుుకుని వెళ్లింది. అయితే, గ్రామస్తులు లోనికి అనుమతించలేదు. గ్రామంలోకి వస్తే సుంకన్న భార్యతో పాటు ఆమె పిల్లలు కూడా క్వారంటైన్ కు వెళ్లాలని అధికారులను కోరారు. ఆమెకు పిల్లలు ఉన్నారు. పైగా గర్భిణీ కూడా.

ఆ స్థితిలో క్వారంటైన్ కు వెళ్లడం ఇష్టం లేక శవంతో వెనుదిరిగి హైదరాబాదు వెళ్లింది. హైదరాబాదులో భర్త అంత్యక్రియలు నిర్వహించింది. సుంకన్న తల్లిదండ్రులు అంత్యక్రియలను వీడియో కాల్ చూశారు. కరోనా మహమ్మారి కుమారుడిని కడసారి కూడా చూసుకోకుండా చేసిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. అనంతపురం జిల్లాలో 51 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వణుకు పుట్టిస్తోంది. ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేయి దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో తాజాగా 61 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ తో మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 31కి చేరుకుంది. 

రాష్ట్రంలో 171 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 814గా ఉంది. గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి.  ఆ తర్వాత కర్నూలు జిల్లాలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. 

కర్నూలు జిల్లా మొత్తం 275 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు 209కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కు దూరంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో మాత్రం కేసులు నమోదు కాలేదు. చిత్తూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు. కొంత వరకు ఈ మూడు జిల్లాలకు ఊరట లభించినట్లే.

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వల్ల అత్యధికంగా మంది మరణించగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎనిమిదేసి మంది మరణించారు. అఅనంతపుూరం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మరణించారు.

జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

అనంతపురం 51
చిత్తూరు 73
తూర్పు గోదావరి 37
గుంటూరు 209
కడప 55
కృష్ణా 127
కర్నూలు 275
నెల్లూరు 72
ప్రకాశం 53
శ్రీకాకుళం 3
విశాఖపట్నం 22