వివాహితను చంపింది ప్రియుడే... ఎందుకోసమంటే..: అనంతపురం హత్య మిస్టరీని చేధించిన పోలీసులు

రెండేళ్ల క్రితం అనంతపురం బస్టాండ్ సమీపంలో వివాహిత దారుణ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. మహిళ హత్యవెనును ప్రేమ, మనీ వ్యవహారం దాగివున్నట్లు పోలీసులు తేల్చారు. 

anantapur police cracked the mysterious murder of a married woman

అనంతపురం : రెండేళ్ల క్రితం దారుణ హత్యకు గురయిన వివాహిత కేసును అనంతపురం పోలీసులు చేధించారు. మహిళ ప్రియుడే మాట్లాడటానికని పట్టణంలోని ఆర్టిసి బస్టాండ్ దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చినట్లు పోలీసులు నిర్దారించారు. నిందితున్ని కూడా అరెస్ట్ చేసారు.   

వివాహిత హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ పకీరప్ప మీడియాకు వివరించారు. రాచూర్ రాజేశ్వరి, ఈశ్వర్ దంపతులు అనంతపురంలోని శ్రీనివాస నగర్ లో నివాసముండేవారు. రెండేళ్లక్రితం అంటే  2020 ఆగస్ట్ 8న రాజేశ్వరి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె పుట్టినిల్లు, బంధువులను ఆరాతీయడం, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా లాభం లేకుండా పోయింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. 

ఈశ్వర్ పిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో బస్టాండ్ సమీపంలో ఓ మహిళ మృతదేహ పడివుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఈశ్వర్ ను వెంటపెట్టుకుని అక్కడికి వెళ్లారు. నిర్మానుష్య ప్రాంతంలో పడివున్న ఆ మృతదేహం తన భార్యదిగా ఈశ్వర్ తెలిపాడు. దీంతో మృతదేహం పోస్టుమార్టం, అంత్యక్రియలు జరిగిపోయాయి. పోలీసులు కూడా మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. 

పోలీసులు రాజేశ్వరి హత్యకు గల కారణాలను కనుక్కునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించారు. హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఆర్టిసి బస్టాండ్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సిసి కెమెరాలను పరిశీలించారు. ఇందులో రాజేశ్వరి ఓ వ్యక్తితో కలిసి వెళ్లడం రికార్డయింది. అతడి గురించి ఆరా తీయగా రాజేశ్వరి పుట్టిపెరిగిన కర్నూల్ జిల్లా ఆదోని పట్టణానికి చెందిన చౌదరి ఇనాయతుల్లాగా గుర్తించారు. పెళ్లికి ముందే వీరిద్దరికి పరిచయం వున్నట్లు తెలిసింది. 

ఈశ్వర్ తో పెళ్ళికిముందు రాజేశ్వరి ఇనాయతుల్లాతో ప్రేమలో వున్నట్లు తెలిసింది. అయితే  ఉపాధి నిమిత్తం ఇనాయతుల్లా కువైట్ వెళ్లిపోగా రాజేశ్వరి తల్లిదండ్రులు ఆమె పెళ్లిచేసారు. దీంతో భర్త ఈశ్వర్ తో కలిసి రాజేశ్వరి అనంతపురంలో నివాసముంటోంది.  

అయితే రెండేళ్లక్రితం కువైట్ నుండి తిరిగొచ్చిన ఇనాయతుల్లా మాజీ ప్రియురాలు రాజేశ్వరికి పెళ్లయినట్లు తెలిసినా టచ్ లోకి వెళ్లాడు. రాజేశ్వరి కూడా మాజీ ప్రియుడితో మళ్లీ సాన్నిహిత్యం పెంచుకుంది. ఇలా ఇద్దరూ అప్పుడప్పుడు కలిసేవారు. ఈ క్రమంలోనే తనకు అవసరం వుందని రూ.2 లక్షలను ఇనాయతుల్లా వద్ద తీసుకుంది రాజేశ్వరి. కొద్దిరోజుల్లోనే ఆ డబ్బులు తిరిగిస్తానని చెప్పిన రాజేశ్వరి ఎంతకూ తిరిగివ్వకపోవడంతో ఇనాయతుల్లా ఆగ్రహానికి గురయ్యాడు. 

2020 ఆగస్ట్ 28న మాట్లాడేది వుందని చెప్పి రాజేశ్వరిని ఇంటినుండి బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు ఇనాయతుల్లా.  అనంతపురం బస్టాండ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి తనకు చాలా అవసరం వుంది... డబ్బులు తిరిగివ్వాలని రాజేశ్వరిని కోరాడు. వెంటనే అంత డబ్బు తిరిగివ్వలేనని ఆమె చెప్పడంతో అతడు కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో విచక్షణ కోల్పోయిన అతడు ఆమెను చావబాదాడు. అతడి దెబ్బలు తాళలేక రాజేశ్వరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

రాజేశ్వరి చనిపోయినట్లు గుర్తించి ఆమె మెడలోని బంగారు గొలుసును తీసుకుని ఇనాయతుల్లా అక్కడినుండి పరారయ్యాడు. పోలీసులు తానే ఈ హత్యచేసినట్లు కనిపెడతారని తెలిసి అతడు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. చివరకు రెండేళ్ల తర్వాత ఇనాయతుల్లా నెల్లూరులో వున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు మృతురాలు రాజేశ్వరి బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios