మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. మాష్టర్ ప్లాన్ వేశారు. ఇప్పటికే ఆయన  టీడీపీని వీడి.. వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 2వ తేదీన ఆయన అధికారికంగా జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఆయన పార్టీని వీడటమే.. చంద్రబాబుకి ఒక షాక్ అంటే.. మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.

గత వారం రోజులుగా వైసీపీ లో కీలక నేతలతో భేటీ అవుతున్న ఆనం.. ఇప్పుడు నియోజకవర్గంపై దృష్టిసారించాడు. తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదనే బాధతోనే ఆయన టీడీపీని వీడి వైసీపీలో వెళుతున్న సంగతి తెలిసిందే. కాగా.. తనతోపాటు.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం మొత్తాన్ని టీడీపీకి దూరం చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పావులు కూడా కదుపుతున్నారు.

ఆత్మకూరులో ఆనం కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. బలగం కూడా కాస్త ఎక్కువనే చెప్పాలి. అందుకే ఆయన ఏ పార్టీలోకి వెళ్లాలనుకున్నా.. ఆ పార్టీలోకి సాదర స్వాగతం అందుతోంది. ఇక ఆయన ప్లాన్ ఏంటంటే.. తమ నియోజకవర్గంలోని ముఖ్యనేతలందరినీ వైసీపీలోకి తీసుకొని వెళ్లాలని చూస్తున్నారు. కొందరు ఆయనకు మద్దతుగా ఉన్నప్పటికీ.. మరికొందరు మాత్రం సందిగ్ధంలోపడిపోయారని తెలుస్తోంది.

ఇందుకోసం ప్రత్యేకంగా ఆయన ఆత్మీయ సమావేశం పెట్టి మరీ.. నియోజకవర్గంలోని కీలకనేతలను, కిందిస్థాయి నేతలను ఆహ్వానిస్తున్నారు. ఆ సమావేశానికి వచ్చిన వారందరినీ మెప్పించి.. తనతోపాటు వైసీపీలోకి చేర్చాలని చూస్తున్నారు. ఇదే జరిగితే చంద్రబాబుకి పెద్ద షాకే తగులుతుంది.