జగన్ చొరవ: రాజకీయాల్లోకి ఆనం ఫ్యామిలీ నుంచి తొలి మహిళ, జడ్పీ పీఠంపై అరుణమ్మ
నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారనే విషయం తెలిసిందే. గత 80 ఏళ్లుగా ఆ కుటుంబం రాజకీయాల్లో ఉంది. అయితే, ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తొలి మహిళ మాత్రం అరుణమ్మనే.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవ ి ఆనం అరుణమ్మను వరించనుంది. ఆనం కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తొలి మహిళ ఆమె. జగన్ చొరవ తీసుకుని ఆనం అరుణమ్మను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవికి ఎంపిక చేశారు. నెల్లూరు జడ్పీ పీఠంపై పలువురు నేతలు కన్నేసినప్పటికీ జగన్ అరుణమ్మకు ఆ పదవి కేటాయించారు. ఇది పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది కూడా.
ఆనం కుటుంబం నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. గత 80 ఏళ్లుగా ఈ కుుటంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి మహిళలు రాజకీయాల్లోకి రాలేదు.
ఆనం అరుణమ్మ ఆనం సోదరుల్లో చిన్నవాడైన ఆనం విజయకుమార్ రెడ్డి సతీమణి. ఆనం సోదరుల్లో వివేకానందరెడ్డి మరణించారు. మరో సోదరుడు రామనారాయణ రెడ్డి రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. తమ కుటుంబం నుంచి మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏర్పడలేదనేది ఆనం కుటుంబ సభ్యుల వాదన.
విజయకుమార్ రెడ్డి పదవిని ఆశిస్తుండగా ఆయన సతీమణి అరుణమ్మను నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవికి జగన్ ఎంపిక చేయడం కుటుంబ సభ్యులను కూడా ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. అయితే, విజయకుమార్ రెడ్డి మాత్రం ఆనందం వ్యక్తం చేశారు. గత 80 ఏళ్ల కాలంలో తమ కుటుంబ సభ్యులు ఎవరు కూడా జిల్లా పరిషత్తులో పదవి చేపట్టలేదని ఆయన అన్నారు.