స్పీకర్ ఫార్మాట్‌లోనే ఎంపీ పదవికి రాజీనామా చేశానన్నారు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్. వైసీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోదా కోసం రాజీనామా చేద్దామంటే చంద్రబాబు వద్దన్నారని తెలిపారు.

ప్రత్యేకహోదా పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని, మోడీ మళ్లీ అధికారంలోకి రారని తెలిసి...కాంగ్రెస్‌తో జతకట్టారని అవంతి ఆరోపించారు. ఇన్ని రోజులు బీజేపీతో జతకట్టి.. ఇప్పుడు కాంగ్రెస్‌తో నాటకాలు ఆడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

తను ఏదీ చెబితే ప్రజలు నమ్ముతారని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా విషయంలో మొదటి నుంచి జగన్‌ది ఒకటే స్టాండ‌ని శ్రీనివాస్ గుర్తు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టాల్సిన అవసరం వైసీపీకి లేదని, పోలీస్ వ్యవస్థ మొత్తం ఒక కులం వాళ్లేనని ఆరోపించారు.

ఆయన చేతిలో పోలీస్ వ్యవస్థ ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. అవినీతి, బంధుప్రీతి రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, మేమేం చేసినా ప్రజలు అడగరనే ధీమాలో చంద్రబాబు ఉన్నారని శ్రీనివాస్ ఆరోపించారు.

సీఎం అవినీతే ప్రత్యేకహోదా రాకపోవడానికి కారణమని, ఎన్నికల ముందు స్కీంలు పెడితే చంద్రబాబుకు ఓట్లు పడవని జోస్యం చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే అవినీతిపై పీఎంవోకు ఫిర్యాదు వెళ్లిందని, విచారణ జరపడంతోనే చంద్రబాబుకు మోడీకి విభేదాలు వచ్చాయంటూ అవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఐదేళ్లలో చంద్రబాబుతో నా సొంత పనులు ఒక్కటి కూడా చేయించుకోలేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. పార్టీలు మారడంపై ముఖ్యమంత్రి మాట్లాడటం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు.  

బాబు అదే నమ్ముతారు: వైసీపీలో చేరిన అవంతి