రాజమహేంద్రవరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో చేశామని చెప్పుకొచ్చారు. రాజమహేంద్రవరంలో గురువారం పర్యటించిన అమిత్ షా పుల్వామా క్వారీ మార్కెట్‌ సెంటర్‌ వద్ద పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 

అనంతరం లాలాచెరువు వద్ద ఉభయగోదావరి జిల్లాల పదాధికారుల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలపై నిప్పులు చెరిగారు. ఉగ్రవాద దాడిని కూడా రాజకీయం చెయ్యాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

చంద్రబాబు ఢిల్లీ, కోల్ కతా వెళ్లి ధర్నాలు చేస్తారని కానీ ధర్నా చెయ్యాల్సిందే కాంగ్రెస్ పార్టీ ముందేనన్నారు. దేశభద్రతతకు మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. భారత సైనికులకు మోడీ వెన్నుదన్నుగా ఉన్నారని గుర్తు చేశారు. 

వీర జవాన్ల మరణాలను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రాజకీయం చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. దేశ ప్రధానిపై విశ్వాసం లేదన్న చంద్రబాబు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విశ్వాసం ఉందా అంటూ నిలదీశారు. రాజకీయాలకు హద్దు ఉండాలని హితవు పలికారు.

 చంద్రబాబు నాయుడు లాలూచీ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను 90 శాతం అమలు చేశామని తెలిపారు. తాము నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖర్చు చెయ్యకుండా భారీ అవినీతికి  పాల్పడుతోందని విమర్శించారు. 

ఐదేళ్లలో రాష్ట్రానికి 20 ప్రతిష్టాత్మక సంస్థలను కేంద్రం ఇచ్చిందన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రూ0.180కోట్లు ఇచ్చామని తెలిపారు. గెయిల్, హెచ్పీసీఎల్ లక్ష కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని స్పష్టం చేశారు. 

కంటైనర్ కొర్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.4,500కోట్లు పెట్టుబడులు పెట్టిందని గుర్తు చేశారు. కోస్తా ప్రాంతంలో రూ.55,475 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందని అమిత్ షా చెప్పుకొచ్చారు. అమరావతి, పోలవరానికి నిధులు తాము ఇచ్చినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చెయ్యడం లేదని విమర్శించారు. 

రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలూ కుటుంబ, అవినీతి పార్టీలు అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ వల్ల కానీ చంద్రబాబు వల్లకానీ ఒరిగేదేమీ ఉండదని అమిత్ షా చెప్పుకొచ్చారు.