అమరావతి: కేంద్ర హోం మంత్రి, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అపాయింట్ మెంట్ రద్దయింది. మహారాష్ట్ర ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసే వరకు అపాయింట్ మెంట్ ఇవ్వడం కుదరదని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇటీవలి కాలంలో వైఎస్ జగన్ కు అమిత్ షా ఇచ్చిన అపాయింట్ మెంట్ రద్దు కావడం ఇది రెండోసారి. జగన్ కోసం ఢిల్లీలోని ఎపి భవన్  లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహారాష్ట్ర పర్యటన కారణంగా అమిత్ షా అందుబాటులో ఉండడం లేదు.

అమిత్ షా అందుబాటులో లేకపోవడంతో వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఎపి భవన్ అధికార వర్గాలంటున్నాయి. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.

 ఆ తర్వాత ఆయన అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. అపాయింట్ మెంట్ లభించకపోవడంతో వెనుదిరిగి వచ్చారు. జగన్ రేపు శనివారం ఢిల్లీ వెళ్లాల్సి ఉండింది.