అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశంపార్టీ నేతలు బ్యాంకులను బాగానే ముంచేస్తున్నారు. ఇప్పటికే ఓ ఐదుమంది కీలక నేతలు ఉద్దేశ్యపూర్వక బ్యాంకు రుణాల ఎగవేతదారులుగా ముద్రపడగా తాజాగా మరో నేత ఆ జాబితాలో చేరారు. ఇప్పటి వరకూ బ్యాంకు రుణాల ఎగవేతదారులుగా ముద్రపడిన వారందరూ ప్రజాప్రతినిధులుగా ఉండటమే ఆశ్చర్యం. ప్రజా జీవితంలో విశ్వసనీయత, పారదర్శకత గురించి చంద్రబాబునాయుడు మళ్ళీ రోజుల తరబడి లెక్షర్లు దంచుతుంటారు. ప్రతిపక్ష నేత గురించి కూడా నోటికి వచ్చింది మాట్లాడే టిడిపి నేతలకు కూడా తమ సహచరులు చేస్తున్న మోసాలు మాత్రం గుర్తుకు రావు.

ఇప్పటికే బ్యాంకు డిఫాల్టర్లుగా కేంద్రమంత్రి సుజనా చౌదరి, వాకాటి నారాయణరెడ్డి, గంటా శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులున్నారు. అటువంటి వారి జాబితాలో తాజాగా ఏలూరు మాజీ ఎంఎల్ఏ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అంబికా కృష్ణ కూడా చేరారు. ఈయన గారు చెన్నైలోని విజయబ్యాంకులో రూ. 35 కోట్లు రుణం తీసుకున్నారు. కానీ ఎంతకీ అప్పు తీర్చటం లేదు. అడిగి అడిగి విసిగిపోయిన బ్యాంకు అధికారులు ఏలూరులోని అంబికా ఫ్యాక్టరీకి శుక్రవారం ఉదయం చేరుకున్నారు.

నేరుగా కంపెనీలోకి వెళ్ళి తాము వచ్చిన పని చెప్పి ఫ్యాక్టరీని, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని చెప్పారట. దాంతో బిత్తరపోయిన అక్కడి వారు వెంటనే ఆ విషయాన్ని కృష్ణకు చేరవేసారట. కృష్ణ వారితో మాట్లాడి వీలైనంత తొందరలో బాకీ తీర్చేస్తానని బ్రతిమాలుకుని రాతపూర్వకంగా హామీ ఇచ్చారట.  దాంతో కొంత కాలం గడువిచ్చిన అధికారులు చెన్నైకి తిరిగి వెళ్ళిపోయారు.

బ్యాంకుల నుండి రుణులు తీసుకుంటున్న వారి ఉద్దేశ్యమేంటంటే, తిరిగి చెల్లించటం ఎంతమాత్రం కాదు, పూర్తిగా ఎగ్గొట్టటమే. తమకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఏవో ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తెచ్చేసుకుంటారు. తర్వాత బ్యాంకులవైపు తిరిగి కూడా చూడరు. ఇచ్చిన అప్పు వసూలు చేసుకోవటం కోసం బ్యాంకులు వీరి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండాల్సిందే. బ్యాంకుల డిఫాల్టర్ల జాబితాలో ఇప్పటికి బయటపడింది వీరే. బయటపడని వారు ఇంకా ఎంతమంది ఉన్నారో ?