హిందూపురం: తెలుగుదేశానికి కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో అసంతృప్తి జ్వాల రగులుతోంది. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా నిన్న మెున్నటి వరకు నేనంటే నేను అనుకున్న నిమ్మల, పరిటాల వారసులకు మరోక నాయకుడు తోడయ్యారు. 

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా తన తనయుడు అంబరీష్ ను బరిలోకి దించాలని ప్రస్తుత ఎంపీ నిమ్మల కిష్టప్ప భావిస్తున్నారు. అయితే అదే సీటుపై మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ కూడా కన్నేశారు. 

2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్న శ్రీరామ్ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే అనూహ్యంగా టీడీపీ నేత, రాష్ట్ర వాల్మీకి సేవాదళ్ అధ్యక్షుడు అంబికా లక్ష్మీనారాయణ పేరు తెరపైకి తీసుకువచ్చారు తెలుగుతమ్ముళ్లు. 

బీసీ కులాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అంబికా లక్ష్మీనారాయణకు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నియోజకవర్గంలో బీసీ వర్గంలో బలమైన నాయకుడుగా అంబికా ఉన్నారని ఆయన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాదరణ పొందారని చెప్తున్నారు. 

ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న హిందూపురం ప్రాంతాల్లో అన్ని వార్డుల్లో అంబికా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నీటి ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల దాహర్తిని తీరుస్తూ అందరి మన్నలను పొందుతున్నారని చెప్తున్నారు. నియోజకవర్గంలో 50 శాతం బీసీలు ఉన్నారని వారంతా అంబికా లక్ష్మీనారాయణ వెంటే ఉన్నారని చెప్తున్నారు. 

తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న అంబికా లక్ష్మీనారాయణకు హిందూపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని లేదా ఎమ్మెల్సీగా అయినా అవకాశం ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్లు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. 

ఇప్పటికే నియోజకవర్గాల వారీగా తెలుగు తమ్ముళ్లు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. త్వరలోనే వీరంతా చంద్రబాబును కలిసి టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చెయ్యనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కదిరి మాజీ సీఐ మాధవ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు.