Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ పవన్.. ఢిల్లీ వెళ్లనున్న అంబటి.. ‘‘బ్రో’’ లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు!!

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ నటించిన బ్రో మూవీ టార్గెట్‌గా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

ambati rambabu targets pawan kalyan he will go to delhi and likely to complaint on bro movie to central agencies ksm
Author
First Published Aug 2, 2023, 12:32 PM IST

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ నటించిన బ్రో మూవీ టార్గెట్‌గా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. బ్రో చిత్రంలోని శ్యాంబాబు పాత్ర ద్వారా తనను అవమానించేందుకు పవన్ యత్నించారని అంబటి ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బ్రో సినిమా డిజాస్టర్ అయిందని.. కలెక్షన్లు పెంచుకోవడం కోసమే తనపై వివాదం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఠా అమెరికాలో డబ్బులు వసూలు చేసి బ్రో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్‌ అందజేస్తే.. ఆయన పవన్ కల్యాణ్‌కు ప్యాకేజ్ అందించారని కూడా ఆరోపణలు చేశారు. 

అయితే తాజాగా ఈ వివాదంలో మరో ట్విస్ట్ చేసుకుంది. బ్రో చిత్రం లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు మంత్రి అంబటి రాంబాబు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. వైసీపీ ఎంపీలతో కలిసి  బ్రో చిత్రం లావాదేవీలపై దర్యాప్తు  సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్టుగా సమాచారం. 

ఇక, ఇటీవల విడుదలైన ‘బ్రో’ చిత్రంలో శ్యాంబాబు పాత్ర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిత్రంలో శ్యాంబాబు పాత్రను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పోషించారు. అయితే ఈ పాత్ర ద్వారా తనను అవమానించే ప్రయత్నం చేశారని మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా తాను వేసిన డ్యాన్స్‌ను ఉద్దేశించి కించపరిచేలా ఈ సీన్ చొప్పించారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునేందుకే పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదల చేశారని ఆరోపించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తం కూడా ఉందని ఆరోపణలు చేశారు. “బ్రో కలెక్షన్స్ రోజురోజుకు తగ్గిపోతున్నాయి మరియు పవన్ కళ్యాణ్ కి చెల్లించిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అందుకే వారు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కొన్ని వివాదాలను రేకెత్తిస్తున్నారు. ఈ ప్రక్రియలో సినిమాను అద్భుతంగా అభివర్ణిస్తున్నారు’’ అని అన్నారు. 

‘‘బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉన్నాయి. చంద్రబాబు ముఠా అమెరికాలో డబ్బులు వసూలు చేసి విశ్వప్రసాద్‌కి ఇస్తే... ఆ డబ్బును పవన్‌ కళ్యాణ్‌కు ప్యాకేజీ అందించారు. విశ్వప్రసాద్‌ బ్లాక్‌ మనీని వైట్‌గా చేసి సినిమా ద్వారా పవన్‌ కల్యాణ్‌కు ప్యాకేజీ రూపంలో ఇచ్చారు. ఇది ఒక స్కామ్‌. రాజకీయాల్లో ఉండి సినిమాలు తీయోచ్చు కానీ... సినిమాల్లో ఉండి రాజకీయాలు చేస్తూ సినిమాలు వదలకపోతే రెండూ నాశనం అవుతాయి.  ఎన్టీఆర్‌ వంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాక ఒకటీ రెండు సినిమాలు తీశారేమో కానీ సినిమాలను అయితే వదిలేశారు. చిరంజీవి కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నాళ్లు సినిమాలు తీయలేదు. 

పవన్‌కు గుణపాఠం మేం కూడా ఒక సినిమా తీయాలి అనుకుంటున్నాం. ఒక మంచి కుటుంబ నేపథ్యం.. ఒక చిన్న కుటుంబంలో పుట్టినప్పటికీ అన్నదమ్ములు ఒక రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి పెద్ద సెలబ్రిటీలు అవుతారు. ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి యుక్త వయసు వచ్చి..చదువు సరిగ్గా అబ్బక...బజార్ల వెంట చిల్లరగా తిరిగితూ ఏం చేయాలో అర్ధం కాకపోతే అతన్ని అన్నయ్యల వద్ద పెట్టారు. నేను అన్నయ్యల వద్ద ఉండను.. అన్నల్లో కలిసిపోతాను..రౌడీయిజం చేస్తాను.. అక్కడా ఇక్కడా గోకుతాను అనేవాడు. ఇక లాభం లేదని తన అన్నలు తమ సినిమా రంగంలోకే అతన్ని తీసుకొస్తారు.  అనూహ్యంగా ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి అన్నయ్యల కంటే పెద్ద సెలబ్రిటీగా అతను మారిపోతాడు. ఎక్కడికెళ్లినా ఊగిపోతూ ఉపన్యాసాలు చెప్పడంతో అమాయక జనం ఈలలు వేస్తుంటారు. దేశం, సమాజం, మానవత్వం, సాంప్రదాయాల గురించి అద్భుతంగా వల్లెవేస్తుంటాడు. ఇది బయటకు కనిపించే కథ.  మేడిపండు చందంగా అతని నిత్య జీవితంలోకి వస్తే అతనికి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి పట్టుమని రెండేళ్లు కూడా ఉండదు.. మళ్ళీ మరో పెళ్ళి.. పిల్లల్ని కంటాడు.. భార్యతో విభేదిస్తాడు. సంసారం చేస్తూనే మరో స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు. ఆ స్త్రీ నన్ను పెళ్లిచేసుకుంటావా లేదా అంటే మొదటి భార్యతో సెటిల్‌ చేసుకుని రెండో భార్యను పెళ్లిచేసుకుంటాడు. ఇంతటితో ఆగదు..రెండో భార్యకూ అదే జరుగుతుంది. రెండో భార్యకు ఏం జరిగిందో మూడో భార్యకూ అదే జరుగుతుంది. మూడో భార్యకు ఏం జరుగుతుందో.. నాలుగో భార్యకూ అదే జరుగుతుంది. క్లైమాక్స్‌లో అందరు పిల్లలు, అందరు భార్యలు కలిసి మహిళా లోకం మెచ్చుకునేలా అతడికి తగిన గుణపాఠం నేర్పుతారు.’’ అని విమర్శలు గుప్పించారు. 

‘నిత్య పెళ్లికొడుకు’, ‘తాలి-ఎగతాళి’, ‘బహుభార్య ప్రవీణుడు’, ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిల్లు’ వంటి కొన్ని టైటిల్స్‌ని పరిశీలిస్తున్నామని అంబటి రాంబాబు అన్నారు. పవన్ కల్యాణ్.. బ్రో కాదు మ్రో(మ్యారేజెస్‌.. రిలేషన్స్‌.. అఫెండర్‌) అంటూ విమర్శలు గుప్పించారు.  తెలుగు చలనచిత్రసీమలో ఉన్న నిర్మాతలు, నటులు, దర్శకులు, త్రివిక్రమ్‌లాంటి రచయితలకు చెప్తున్నా. ఇలా మళ్లీ మళ్లీ చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios