ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం అమర్‌నాథ్ గుహ సమీపంలో క్లౌడ్ బరస్ట్ అనంతరం ఆకస్మిక వరద ముంచెత్తడతం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో  ఏపీకి చెందిన ఇద్దరు మహిళలు కూడా మృతిచెందినట్టుగా సమాచారం.

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం అమర్‌నాథ్ గుహ సమీపంలో క్లౌడ్ బరస్ట్ అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక వరద పోటెత్తింది. ఈ ఘటనలో 16 మంది యాత్రికులు మరణించారు. మరికొంతమంది కనిపించకుండా పోయారు. దీంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషాద ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు మహిళలు కూడా కనిపించకుండా పోయారు. వారిని రాజమహేంద్రవరానికి చెందిన జి సుధ, కె పార్వతిగా గుర్తించారు. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వారిద్దరు మృతిచెందినట్టుగా సమాచారం అందుతుంది. ఈ మేరకు కొన్ని తెలుగు టీవీ చానల్స్ రిపోర్టు చేశాయి. సుధ, పార్వతిలు వదరల్లో గల్లంతై మృతిచెందారని.. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో పార్వతి మృతదేహం, శ్రీనగర్ మార్చురీలో సుధ మృతదేహం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

ఇక, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి 86 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. అమర్‌నాథ్ యాత్రలో ఆకస్మిక వరద చోటుచేసుకోవడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినవారి భద్రత కోసం తక్షణమే అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సెక్రటేరియట్‌లో 1902, న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో 011-23384016 హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. అక్కడ చిక్కుకుపోయిన ఏపీ యాత్రికుల స్వస్థలానికి సురక్షితంగా చేర్చే చర్యలను పర్యవేక్షించేందుకు ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్‌ను శ్రీనగర్‌కు పంపారు. 

ఈ క్రమంలోనే ఏపీ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఇద్దరు మహిళలు మినహా మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే తాజాగా గల్లైంతన ఇద్దరు మహిళలు మృతిచెందినట్టుగా తేలింది. ఇక, ఆ మహిళతో పాటు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు.