అమరావతి: నవ్యాంధ్ర రాజధానిలో మాజీసీఎం చంద్రబాబు నాయుడు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాజధాని అంశంపై చంద్రబాబు నాయుడు రకరకాలు ప్రకటనలు చేశారని చెప్పుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో రాజధానిపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా తూళ్లూరులో రైతులు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన బుగ్గన చంద్రబాబుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రాజధానిగా రెండు మూడు ప్రాంతాల్లో ప్రకటించడంతో హైదరాబాద్ లో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతా వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేసి ధరలు అమాంతం పెంచేశారని చెప్పుకొచ్చారు. రెండు మూడు ప్రాంతాల పేర్లు చెప్పడంతో వ్యాపారులు అక్కడ భూములు కొనుగోలు చేసి నష్టపోయారని ఆరోపించారు.

 చివరగా అమరావతి అని చెప్పి అసలు విషయం చెప్పారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని ఆరోపించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. హైదరాబాద్ నుంచి ఎలాంటి సందర్భంలో పారిపోయి అమరావతికి వచ్చేశారో అందరికీ తెలుసునన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సవాల్ లు, బాధ్యతలు ఉంటే వాటన్నింటిని పట్టించుకోకుండా రాత్రికి రాత్రి హుటాహుటిన హైదరాబాద్ వదిలి అమరావతి వచ్చేసిన పరిస్థితి అని ఆరోపించారు. రాత్రికి రాత్రే రాజధానిని అమరావతికి తరలించడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 

చంద్రబాబు వ్యక్తిగతం కోసం, పార్టీ కోసం, వారి అనుచరుల కోసమే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఆర్నెళ్లలో అమరావతిని రాజధానిగా ప్రకటించి వేల ఎకరాల భూమిని తీసుకున్నారని ఆరోపించారు. 

ఇన్ సైడ్ ట్రేడింగ్ అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. భూములు తీసుకునే అంశంపై విచారణ జరుగుతుందని తెలిపారు. తనపై గౌరవంతో సింగపూర్ ప్రభుత్వం వచ్చి రాజధాని కోసం ప్లాన్ వేశారని అసత్యాలు చెప్పారని కానీ రూ.13 కోట్లు ఇచ్చిన విషయాన్ని దాచిపెట్టారన్నారు. 

సింగపూర్ వాళ్లు కేపిటల్ కోసం భారీగా నిధులు ఇచ్చారని తెలిపారు. 2014 డిసెంబర్ లో అమరావతి రాజధానిగా ప్రకటించిన అనంతరం 2015 మార్చ్ వరకు ఫ్రీగా సింగపూర్ ప్రభుత్వం ఫ్రీ ప్లాన్ ఇచ్చిందని చెప్పుకొచ్చిన చంద్రబాబు ఆ తర్వాత 2016లో పరిధిలో భూములను తొలగించారని తెలిపారు. 

అనంతరం సీఆర్డీఏ పరిధిలోకి చంద్రబాబుకు అనుకూలమైన వారి భూములను కాపాడుకునేందుకు వాటిని జాబితా నుంచి తొలగించారని చెప్పుకొచ్చారు. రాజధానిని ఒక వ్యాపారంగా చూశారని మండిపడ్డారు. రాజధానికి సంబంధించి ఒక్క భవనం అయినా కట్టారా అంటూ మండిపడ్డారు. 

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రయత్నించలేదా అని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజధానిలో ప్లాట్ లు వేసే బాధ్యతను సింగపూర్ కు చెందిన రెండు సంస్థలకు అప్పగించారని తెలిపారు. 

అయితే అందుకు 1700 ఎకరాలు మాత్రమే అప్పగించి ప్లాట్ లు వేయడం, ఐకాన్ బిల్డింగ్ పేరు చెప్పి రైతులను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇండార్స్ మెంట్ సీల్ కోసం సింగపూర్ వారితో టై అప్ పెట్టుకున్నారని ఆరోపించారు. 

శివరామకృష్ణన్ కు 1500 ఎకరాలు అవసరమని చెప్పిన చంద్రబాబు 33వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు తుంగలో తొక్కారని నిలదీశారు.