Asianet News TeluguAsianet News Telugu

Amaravati Maha Padayatra: అమరావతి రైతులపై పోలీసుల లాఠీచార్జ్... లోకేష్ సీరియస్

న్యాయస్థానం టు దేవస్థానం పేరిట అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు మరిన్ని ఆంక్షలు విధించడం ఉద్రిక్తతకు దారితీసింది. 

Amaravati Maha Padayatra... Police Loty Charge on farmers... nara lokesh serious
Author
Amaravati, First Published Nov 11, 2021, 1:58 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని... మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అంటూ అమరావతి జేఎసి ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో పదకొండవ రోజు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి ప్రారంభమైన రాజధాని రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. 

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడి కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ముందుగా అనుమతి పొందిన రాజధాని ప్రాంతానికి చెందిన 157 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అమరావతి జీఏసీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

అయితే నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రగా వస్తున్న రాజధాని రైతులకు స్వాగతం పలికేందుకు స్థానికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాటచోటుచేసుకుంది. పోలీసులు అడ్డుగా పెట్టిన తాళ్లను దాటుకుని ముందుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసారు. దీంతో పలువురు రైతులకు గాయాలయ్యయి. ఇద్దరు రైతులకు చేయి విరిగినట్లు తెలుస్తోంది. 

read more  Amaravati Padayatra: పోలీసులు లారీచార్జ్‌లో విరిగిన రైతు చేయి.. వర్షంలోనూ కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర

ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం దారుణమన్నారు లోకేష్. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేసారు. 

న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర జ‌గ‌న్ స‌ర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందన్నారు. పోలీసుల్ని ప్ర‌యోగించి పాద‌యాత్ర‌కి అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పించ‌డం న్యాయ‌మా? హైకోర్టు అనుమ‌తితో చేస్తున్న పాద‌యాత్ర‌కి ఖాకీల ఆంక్ష‌లు ఎందుకో? అని లోకేష్ నిలదీసారు. 

''ఎండ‌న‌క‌, వాన‌న‌క  ఏడుకొండ‌ల‌వాడి స‌న్నిధికి పాద‌యాత్ర‌గా వెళ్తుంటే... వారికి సంఘీభావం తెలప‌డ‌మూ నేర‌మా? క‌వ‌రేజ్‌కి వ‌చ్చిన‌ మీడియా ప్ర‌తినిధుల్ని ఎందుకు ఆపుతున్నారు? మహాన్యూస్ ఎండీ వంశీని, పలువురు పాత్రికేయులను పోలీసులు అడ్డుకోవ‌డాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని లోకేష్ పేర్కొన్నారు.

read more  Amaravati Maha Padayatra: ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎఫెక్ట్... అమరావతి రైతులకు పోలీసుల నోటీసులు (వీడియో)

అమరావతి రైతులు, మహిళలు జోరును కురుస్తున్న వర్షంలోనూ తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రాత్రిపూట వారు బసచేసిన నాగులుప్పలపాడులో ఆకాల వర్షం కారణంగా గుడారాలు తడిచిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గురువారం 11వ రోజు వర్షంలోనే నాగులుప్పలపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. గొడుగులు, రెయిన్ కోట్లు ధరించి పాదయాత్రను ముందుకు తీసుకెళ్ళారు. ఈ క్రమంలోనే చదలవాడ వద్దకు చేరుకున్న పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios