చచ్చిపోతాం.. పర్మిషన్ ఇవ్వండి: రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖ

తమను కారుణ్య మరణానికి అనుమతించాలంటూ అమరావతి ప్రాంత రైతులు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖలు రాశారు. 

Amaravati Farmers Write to President Ramnath Kovind

తమను కారుణ్య మరణానికి అనుమతించాలంటూ అమరావతి ప్రాంత రైతులు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖలు రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో తామంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డామని.. అధికారంలోకి వచ్చాకా ఆయన మాటమార్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం జగన్, పలువురు వ్యక్తుల స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని రైతులు ఆరోపించారు. రాజధాని మార్చవద్దంటూ మా కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా తమను పట్టించుకున్నవారు లేరని వారు తెలిపారు.

Also Read:వై‌ఎస్ జగన్ మూడు రాజధానులు: విశాఖ ఏ మేరకు సేఫ్ ?

అధికార పార్టీ నేతలు తమ త్యాగాన్ని హేళన చేస్తున్నారని.. కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న శాసన సభాపతి , మంత్రులు , ఎమ్మెల్యేలు రాజధానిని స్మశానం అని ఒకరు, ఎడారి అని అంటున్నారని మండిపడ్డారు.

ఆందోళన చేస్తున్న తమను పెయిడ్ ఆర్టిస్టులు అని మరొకరు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రైతులు వాపోయారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తమపై దాడులకు దిగుతున్నారని..  అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి జైళ్లలో పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారు: జగన్‌పై పవన్ వ్యాఖ్యలు

అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారని.. తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైందన్నారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టిందని.. ఒక మంచి కార్యం కోసం మేం చేసిన త్యాగాలకు దక్కిన ఫలితమిదని రైతులు వాపోయారు. రాజధాని తరలిపోతే మేము జీవచ్ఛవాలుగా మిగిలిపోతామని.. ఈ బతుకులు తమకొద్దంటూ రైతులు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios