అమరావతి నుండి అరసవెల్లి:ప్రారంభమైన రైతుల మహ పాదయాత్ర

అమరావతి రైతుల మహ పాదయాత్ర ఇవాళ ప్రారంభమైంది. అమరావతి నుండి అరసవెల్లి వరకు యాత్ర సాగనుంది. ఈ యాత్రలో  సుమారు 600 మంది పాల్గొన్నారు. 
 

Amaravati Farmers maha padayatra Begins


హైదరాబాద్: అమరావతి రైతుల  మహా పాదయాత్ర సోమవారం నాడు ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు ఏపీ హైకోర్టు ఈ  నెల 9వ తేదీన అనుమతిని ఇచ్చింది. దీంతో రైతులు ఇవాళ ఉదయం అమరావతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి పాదయాత్రనుప్రారంభించారు. 

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని  అమరావతి జేఏసీ నిర్వహిస్తున్న ఆందోళనలు వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాయి. దీంతో అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయం వరకు అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహించనున్నారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది. 

గతంలో కూడ అమరావతి నుండి తిరుపతి వరకు రైతులు పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. పలు జిల్లాల గుండా పాదయాత్ర సాగింది. 

అమరావతి రైతుల మహా పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొంటారు. ఈ పాదయాత్రకు పరిమిత ఆంక్షలతో ఏపీ హైకోర్టు అనుమతిని ఇచ్చింది.పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని నిర్వహించే బహిరంగ సభకు కూడ  ఇప్పుడే అనుమతిని తీసుకోవాలని కూడ హైకోర్టు అనుమతి జేఏసీకి సూచించింది.  మహా పాదయాత్రకు  అనుమతి కోసం గత మాసంలోనే అమరావతి జేఏసీ డీజీపీని కోరింది.

అయితే పోలీసుల నుండి అనుమతి విషయమై ఎలాంటి సమాచారం రాకపోవడంతో అమరావతి జేఏసీ ఏపీ హైకోర్టులో అనుమతి కోరుతూ పిటిషన్  దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణకు సంబంధించి ఈ నెల 9వ తేదీన తుది తీర్పును ఇవ్వనున్నట్టు ఏపీ హైకోర్టు తెలిపింది. అయితే ఈ నెల 8వ తేదీ రాత్రి మహా పాదయాత్రకు అనుమతిని నిరాకరిస్తూ ఏపీ డీజీపీ అమరావతి జేఏసీకి సమాచారం పంపారు. అయితే ఈ నెల 9వ తేదీన మహా పాదయాత్రకు పరిమిత ఆంక్షలతో ఏపీ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. 

మహాపాదయాత్రలో పాల్గొనే రైతుల పేర్లతో గుర్తింపు కార్డులు కూడ ఇవ్వాలని ఏపీ హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. అమరావతి రైతుల మహా పాదయాత్ర విషయమై ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఉత్తరాంధ్రపై  దండయాత్రగా  వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చిందని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

 అమరావతి రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికే అమరావతి రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios