అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంపై సీఐడి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా 2016 ఫిబ్రవరిలో జీవో నెంబర్ 41 తీసుకుని వచ్చారని దర్యాప్తు అధికారి ఎ. లక్ష్మీనారాయణ కౌంట్ అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఆ జీవో రాష్ట్ర అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం, ఏపీసీఆర్డీఎ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. 

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలో ఈ ఏడాది మార్చిన 19వ తేదీన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేయాలని ఆయన కోరారు. అమరావతి అసైన్డ్ భూముల విషయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ విడివిడిగా పిటిషన్లు దాఖలుచేశారు. 

ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దానిపై సీఐడి తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. పేద రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములను అక్రమించేందుకు, తమ వారికి ప్రయోజనం కలిగించేందుకు జీవో 41ని తీసుకుని వచ్చారని సీఐడి తన విచారణలో తెలిపింది.

చట్ట నిబంధనలను ఉల్లంఘించేందుకు జీవోను వాడుకున్నారని, దానివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని కౌంటర్ లో తెలిపారు. నోట్ ఫైల్ ను పరిశీలిస్తే జీవో జారీకి ముందు గానీ, ఆ తర్వాత గానీ మంత్రి మండలి ముందు దాన్ని పెట్టలేదని తేలిదని, జీవో అమలులోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, ఇంచార్జీ మంత్రి ఆమోదం ఇచ్చారని సీఐడి తన విచారణలో తెలిపింది. 

జీవో జారీపై కొందరు అధికారులను ప్రశ్నించగా అది అసైన్డ్ భూముల చట్టానికి విరుద్ధమని వాంగ్మూలాలు ఇచ్చారనని, నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్లు జీవో జారీకి సిఫార్సు చేశారని సీఐడి తెలిపింది. జావో జారీలో వారి పాత్రపై విచారణ జరపాల్సి ఉందని అన్ారు. 

రైవెన్యూ రికార్డుల ప్రకారం ఆక్రమణదారులకు అసైన్డ్ పట్టాలు లేవని, నిబంధనల మేరకు వారి స్వాధీనంలో ఉన్న భూములు ప్రభుత్వానివేనని సీఐడి తెలిపింది. జీవో 41ని అడ్డం పెట్టుకుని భూములను ఆక్రమించుకున్నారని చెప్పింది. కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేయడం న్యాయవిచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని సిఐడి వాదించింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేయాలని సిఐడి హైకోర్టును కోరింది.