Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రాజధానిగా అమరావతికే.. కట్టుబడి ఉన్నాం : రాహుల్ గాంధీ..

అమరావతి రాజధానిగా ఉండడానికే తమ పార్టీ కట్టుబడి ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం రాత్రి గన్నవరం విమానాశ్రమంలో కాసేపు ఏపీ కాంగ్రెస్ నేతలతో ముచ్చటించారు. 

Amaravati as the capital of AP : Rahul Gandhi - bsb
Author
First Published Jul 3, 2023, 8:06 AM IST | Last Updated Jul 3, 2023, 8:06 AM IST

అమరావతి : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నేతలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  రాహుల్ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవడం బాధాకరమని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని దీనికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. త్వరలో రాజధాని ప్రాంతంలో ప్రియాంక గాంధీ పర్యటన చేస్తారని రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం తెలంగాణలోని ఖమ్మంలో జరిగిన ‘జన గర్జన సభ’లో ఆయన పాల్గొన్నారు,

ఆ తర్వాత రాత్రి 10. 20 నిమిషాలకు.. రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఏపీ కాంగ్రెస్ నాయకుల బృందంతో దాదాపు 20 నిమిషాల పాటు మంతనాలు చేశారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు అయిన కేవీపీ రామచంద్రరావు, నరహరశెట్టి నరసింహారావు, జెడి శీలం, సుంకర పద్మశ్రీ,, కొలనుకొండ శివాజీ, మేడ సురేష్.. పిసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజులతో మాట్లాడారు.

షర్మిల త్వరలో కాంగ్రెస్ లోకి.. వైఎస్ఆర్ బిడ్డగా ఆహ్వానిస్తాం : కేవీపీ రామచంద్రరావు..

వారితో ఏపీ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఇతర అంశాల మీద కాసేపు చర్చించారు. అమరావతి రాజధానిగా కావడం కోసం భూములు ఇచ్చిన రైతులు పడుతున్న వేదనను వారు వివరించారు. అమరావతి రైతులను వైసిపి ప్రభుత్వం వేదిస్తున్న తీరు గురించి రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆ విషయాలన్నీ తనకు తెలుసునని రాహుల్ చెప్పుకొచ్చారు.. పోలవరం ప్రాజెక్టు పనులు విభజన చట్టంలోని హామీల అమలు,  రాష్టానికి ప్రత్యేక హోదా రాజధాని నిర్మాణం..  తదితరాంశాల్లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతోందని  నేతలు,  కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు.

దీని మీద రాహుల్ సానుకూలంగా స్పందించారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాహుల్తో భేటీ తర్వాత ఈ విషయాన్ని  మీడియాకు వివరించారు.

కాంగ్రెస్ నేతలతో  కలిసి రాహుల్ గాంధీ  ఈనెల కానీ వచ్చే నెల కానీ ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేస్తారని  ఈ సందర్భంగా తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి సంఘీభావం తెలపడం కోసమే ఈ పర్యటన ఉంటుందన్నారు.  విశాఖ పర్యటన సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటు కరణకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద ఉన్న ఈడి, సిబిఐ కేసులను.. వాటిమీద విచారణ పురోగతి ఎంతవరకు వచ్చిందని రాహుల్ గాంధీ ఆరా తీశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ఈ కేసుల్లో విచారణ కోసం జగన్  కోర్టుకు వెళ్లట్లేదని తెలిపారు. ఆయా కేసులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టుగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ కేసులని బూచిగా చూపించి జగన్ ను బిజెపి ప్రభుత్వం వాడుకుంటుందని రాహుల్ వ్యాఖ్యానించారని సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ తెలిపారు.

ఇక ఆదివారం నాడు తెలంగాణలోని ఖమ్మంలో జరిగిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ ల మీద దూరంగా విరుచుకుపడ్డారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అవినీతిని ప్రధాని నరేంద్ర మోడీ అండదండలు బాగా ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి గురించి బిజెపికి బాగా తెలుసునన్నారు. ఢిల్లీ మద్యం విధాన నిర్ణయంలో జరిగిన అవినీతి అంతా దర్యాప్తు ఏజెన్సీలకు తెలుసన్నారు. టిఆర్ఎస్ అంటే బిజెపి రిస్తేదార్ సమితి అని విమర్శించారు. కర్ణాటక ఫలితాలు పునరావృతమయ్యేలా తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించాలని ప్రజలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios