ఏపీ రాజధానుల అంశం తీవ్ర వివాదంగా మారుతోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల ప్రతిపాదనని ప్రకటించారు. అమరావతితో పాటు వైజాగ్, కర్నూలుని కూడా రాజధాని చేసే ఆలోచనలో ఉన్నట్లు జగన్ ప్రకటించడంతో అమరావతి ప్రాంత రైతుల్లో ఆందోళన నెలకొంది. 

అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులంతా ప్రస్తుతం రోడ్లెక్కి నిరసన చేపడుతున్నారు. నిడమర్రు, తుళ్లూరు, వెలగపూడి లాటి అమరావతి పరిసర ప్రాంతాల రైతులంతా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. 

సోమవారం రోజు తుళ్ళూరులో పోలీసులు, రైతుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అమరావతి రైతులు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. 

పోలీసులు రంగంలోకి దిగి నిరసన కారులని, రైతులని అరెస్ట్ చేశారు. ఒక్క ఒక్క రాష్ట్రం ఒక్క రాజధాని, మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ రైతులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. 

విజయవాడ బిల్డర్స్ మరియు బిల్డింగ్ కార్మికులు, వాణిజ్య వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని వినతి  పత్రం  ఇచ్చేందుకు వెళ్లారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట వారికి మద్దతుగా కొందరు నిరసన చేపడుతున్నారు.