విశాఖపట్నం: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటుంటారు అది కాంగ్రెస్,టీడీపీల విషయంలో రుజువైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్ టీడీపీలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఏకమయ్యాయి. త్వరలోనే పొత్తుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి టీడీపీ మహాకూటమిగా ఏర్పడింది. 

ఇటీవలే జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. రాబోయే రోజుల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇరుపార్టీలు కలిసి పనిచేస్తాయని అటు రాహుల్ గాంధీ, ఇటు చంద్రబాబు ప్రకటించేశారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

కాంగ్రెస్ టీడీపీల మైత్రికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజం పడితే అది చెట్టై ఏపీలో మరింత బలపడనుందని సమాచారం. అయితే కాంగ్రెస్ తో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఇప్పటికే వైసీపీ నుంచి గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతల వల్ల సీట్లపై నానా గందరగోళం ఏర్పడితే తాజాగా కాంగ్రెస్ తో పొత్తు అంటుంటే తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనని టీడీపీ నేతలు భయాందోళన చెందుతున్నారు. నెలల వ్యవధిలో ఎన్నికలుండగా పొత్తుల ట్విస్ట్ తమ రాజకీయ భవిష్యత్ ను ఎక్కడ శంకరగిరి మాన్యాలు పట్టిస్తుందోనని ఆవేదన చెందుతున్నారు.    

కాంగ్రెస్ తో పొత్తు వల్ల తెలుగుదేశానికి ఎంత లాభం చేకూరుతుందో తెలియదు కానీ టీడీపీకి మాత్రం మైనస్ అని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఏపీలో మెుత్తం తుడిచుకుపెట్టుకుపోయిన కాంగ్రెతో పొత్తుపెట్టుకుని జీవం పోస్తున్నారని తెలుగుతమ్ముళ్లు గుస్సాయిస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా పురుడు పోసుకుందని అలాంటిది ఎన్నికల వేళ పొత్తు పెట్టుకుంటే ప్రజలు హర్షించరని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు బద్దశత్రువులుగా ఉన్న కాంగ్రెస్ టీడీపీలు మిత్రులుగా మారిపోయాయి.  

కాంగ్రెస్‌తో పొత్తు వల్ల తమ టిక్కెట్లు ఎక్కడ గల్లంతు అవుతాయోనని టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో కాంగ్రెస్ టీడీపీల పొత్తు ఆపార్టీ ఎమ్మెల్యేల పాలిట శాపంగా మారింది. విశాఖపట్నం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పని చేస్తున్నారు. ఈయన గతంలో పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి కూడా అయ్యారు.  

ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ ఉంది అని అనుకోవాలంటే అది పీసీసీ కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్‌ వల్లేనన్నది నగ్న సత్యం. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న బాలరాజు, ద్రోణంరాజు శ్రీనివాస్ లు గత ఎన్నికల్లో పోటీ చేసినా రాష్ట్ర విభజన పుణ్యమా అంటూ దారుణంగా ఓడిపోయారు. విభజన పాపం వెంటాడటంతో కనీసం డిపాజిట్ కు కూడా నోచుకోలేదు.  

ఎన్నికల అనంతరం బాలరాజు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలా తానున్నానని తెలిపేందుకు మధ్యలో ఓ మెరుపుమెరిపించి వెళ్లిపోతున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మాజీమంత్రి బాలరాజు ఆశతో ఉన్నారు. 

తాను మళ్లీ యాక్టివ్ రాజకీయం చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశం లేకపోవడంతో ఆయన జనసేనవైపు చూశారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తుపెట్టుకున్న నేపథ్యంలో జనసేనకు జైకొట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. 

పసుపులేటి బాలరాజు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పొత్తులో భాగంగా పాడేరు టిక్కెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో మాజీమంత్రిగా పొలిటికల్ అనుభవంతో పసుపులేటి టిక్కెట్ పై గట్టి పట్టుపట్టారు. 

పొత్తు కన్ఫమ్ అయితే ఎట్టిపరిస్థితుల్లో పాడేరు టిక్కెట్ తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు మాజీమంత్రి మణికుమారి కూడా కన్నేశారు. ఆమె కూడా పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామని ఉవ్విళ్లూరుతున్నారు.  

ఆ తర్వాత బాలరాజు పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నా.. ద్రోణంరాజు మాత్రం అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌–టీడీపీ పొత్తు కారణంగా బాలరాజు పాడేరు, శ్రీనివాస్‌ విశాఖ దక్షిణం నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఒకవైపు బాలరాజు, మరోవైపు మణికుమారి ప్రయత్నాలతో పాడేరు ప్రస్తుత ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంత్రి పదవి వస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయిపోవచ్చునన్న ఆశతో ఆమె టీడీపీలోకి జంప్ అయ్యారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా కనీసం రాష్ట్రస్థాయి కార్పొరేషణ్ చైర్మన్ పదవి అయినా కట్టబెడతారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

అయితే గిడ్డి ఈశ్వరి ఆశలు ఆడియాశలు అయ్యాయి. అటు మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు సరికదా కనీసం రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా దక్కలేదు. రెండు దక్కకపపోగా ఇప్పుడు తన సీటుకే ఎసరు వచ్చే ప్రమాదం పడటంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంత్రి పదవికోసం వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆమె టీడీపీలో ఆశించింది దక్కకపోగా సీటుకే ఎసరువచ్చేటట్లు ఉంది. దీంతో అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా గిడ్డి ఈశ్వరి పరిస్థితి తయారైంది. 

ఇదిలా ఉంటే విశాఖ దక్షినియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైతం తన టిక్కెట్ పై మదనపడుతున్నారట. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తు కనుక ఒకే అయితే తనను తప్పించి ద్రోణంరాజు శ్రీనివాస్ కు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతుండటంతో ఆయన తన సీటుకు ఎసరొస్తుందా అంటూ పెద్దల దగ్గర వాకబు చేస్తున్నారు. పీసీసీ కార్యదర్శిగా ఉన్న ద్రోణంరాజు శ్రీనివాస్ గతంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ పోటీ చేసి గెలుపొందారు. 

పొత్తులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో ద్రోణం రాజు శ్రీనివాస్ కు టిక్కెట్ ఇవ్వాల్సిందే. విశాఖ ఉత్తరం నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో మిత్రపార్టీ బీజేపీకి వదిలేసింది తెలుగుదేశం. ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలుపొందారు. ఒకవేళ పొత్తులో భాగంగా విశాఖ ఉత్తరం నుంచి పోటీచెయ్యాలని ద్రోణంరాజు శ్రీనివాస్ ను అడిగినా ఆయన అందుకు ఒప్పుకునే పరిస్థితి లేదు. ద్రోణం రాజు శ్రీనివాస్ మళ్లీ విశాఖ దక్షిణం నుంచే బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. దీంతో వాసుపల్లి గణేష్ కుమార్ సీటు కూడా గల్లంతే. 

మెుత్తానికి కాంగ్రెస్ తో పొత్తు పుణ్యమా అంటూ గిడ్డి ఈశ్వరికి, వాసుపల్లి గణేష్ కుమార్ లు సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని సమాచారం. దీంతో పొత్తువల్ల తమ సీటు ఎక్కడ పోతుందని  భయంతో సీటు జారి గల్లంతైందే అని మదనపడుతున్నారట. మరి వీళ్ల ఆందోళనకు ఫుల్ స్టాప్ పడుతుందా...లేక పొత్తు బెడిసికొడుతుందా అన్నది తేల్చాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.