ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా ఆంధ్రా ఊటీ అరకులో బెలూన్ ఫెస్టివల్ ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ ఫెస్టివల్.. ఎవరి కోసం ఏర్పాటు చేశారనే విమర్శలు ఎదురౌతున్నాయి. ఎందుకంటే.. ఎంతో అట్టహాసంగా రూ.4కోట్లు ఖర్చు పెట్టి మరీ ఏర్పాటు చేసిన ఈ ఫెస్టివల్ లో స్థానికులు ఎవరినీ పాల్గొననివ్వలేదు.

స్థానిక గిరిజనులను మాత్రమే కాకుండా.. పర్యాటకులకు కూడా ఎక్కే అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. మరి ఎవరినీ ఎక్కించకుండా ఇంత హడావిడీ చేసి ఎందుకు ఏర్పాటు చేశారని పర్యాటకశాఖని ప్రశ్నించినా.. వారి వద్ద కూడా సమాధానం లేదు. ఇక పోతే.. కేవలం చంద్రబాబు తన మనవడు దేవాన్ష్, కోడలు బ్రహ్మణి కోసమే ఈ ఫెస్టివల్ ఏర్పాటు చేశారనే విమర్శలు వినపడుతున్నాయి.

ఈ వెంట్ మేనేజర్లకు దీని నిర్వాహక పనులు అప్పగించేసి పర్యాటక శాఖ వారు చేతులు దులుపుకున్నారనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. బెలూన్ ఎక్కి.. అరకు అందాలను చూడొచ్చంటూ ప్రచారం చేపట్టారు. టికెట్ ధర రూ.3వేలు ప్రకటించారు. ఆన్ లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చని కూడా ప్రకటించారు. తీరా.. ఆశతో వెళ్లినవారికి టికెట్ కౌంటర్లు కానీ.. ఆన్ లైన్ లో కూడా వివరాలు సరిగా లేవనే ఆరోపణలు వస్తున్నాయి.

ఎలాగూ ఎక్కలేకపోయాం.. కనీసం బెలూన్స్ గాలిలో ఎగురుతుంటే చూద్దాం అని వెళ్లిన వారికి కూడా తీవ్ర నిరాశ ఎదురైందంటున్నారు పలువురు పర్యాటకులు. అక్కడికి వెళ్లినవారికి కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. చంద్రబాబు కోడలు, మనవుడు.. కొందరు వీఐపీలకు మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి మిగిలిన వాళ్లని పట్టించుకోలేదనే విమర్శలు ఎదురౌతున్నాయి.