ఫిరాయింపుల్లో కలకలం

All the Defection MLAs may not get tickets in next elections
Highlights

  • ఎంఎల్ఏలపై చంద్రబాబునాయుడు చేయిస్తున్న సర్వేల్లో ఫిరాయింపులపై ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది

              

ఎంఎల్ఏలపై చంద్రబాబునాయుడు చేయిస్తున్న సర్వేల్లో ఫిరాయింపులపై ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. సర్వే నివేదికల ప్రకారం ఫిరాయింపుల్లో కలకలం మొదలైందట. ఎందుకంటే, ఫిరాయింపులకు టిక్కెట్లు ఇస్తే గెలిచే వారి సంఖ్య చాలా తక్కువని రిపోర్టు వచ్చిందట. వైసిపి నుండి గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో పార్టీ ఫిరాయింపులకు వారంతా నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసమే అంటూ పెద్ద బిల్డప్ ఇచ్చారు. అయితే, అందులో పెద్దగా నిజం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే, వారు టిడిపిలో చేరినా జరుగుతున్న అభివృద్ది కనిపించటం లేదు.

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టటమే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు ఫిరాయింపులకు తెరలేపారు. వైసిపి ఎంఎల్ఏలు టిడిపిలోకి దూకేముందు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, వ్యక్తిగతంగా తమకున్న అప్పులు, కాంట్రాక్టులు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు, ఎన్నికల ఖర్చు తదితరాలపై స్పష్టమైన హామీ పొందిన తర్వాతే ఫిరాయించారు. ఫిరాయింపులను లాక్కోవటమే ఏకైక లక్ష్యం కాబట్టి చంద్రబాబు కూడా వారడిగిన హామీలన్నీ దాదాపు ఇచ్చేసారు. ఫిరాయింపుల తర్వాత వారందరినీ పక్కన పెట్టేసారు.

దానికితోడు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఫిరాయింపుల విషయంలో చంద్రబాబు స్వరం మారిపోతోంది. ఫిరాయింపులందరకీ టిక్కెట్లు ఇవ్వలేమంటూ అంతరంగిక సంభాషణల్లో చంద్రబాబు స్పష్టం చెబుతున్నారు. కడప జిల్లాలో బద్వేలు ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములకైతే టిక్కెట్టు కష్టమని బహిరంగంగానే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. జయరాములుకు చెప్పినట్లు బహిరంగంగా కాకపోయినా తనను నేరుగా కలసినపుడు మరికొందరికి కూడా టిక్కెట్ల విషయంలో చంద్రబాబు తేల్చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

అంటే, తాజా పరిస్ధితిని బట్టి ఫిరాయింపుల్లో అందరికీ టిక్కెట్లు దక్కవన్నది స్పష్టమవుతోంది. అదే సందర్భంలో నలుగురు ఫిరాయింపు మంత్రుల్లో ఇద్దరు గెలుపు కష్టమనే ప్రచారం బాగా జరుగుతోంది. కారణాలేమైనా కానీ ఆ ఇద్దరి పనితీరుపై అసంతృప్తిగా ఉండటంతో వారికి ముఖ్యమంత్రి అపాయిట్మెంట్ దొరకటమే కష్టంగా ఉన్నట్లు పార్టీ నేతలే  చెబుతున్నారు. పార్టీలో పరిణామాలను బట్టి అర్ధమవుతున్నదేమంటే ఫిరాయింపుల్లో దాదాపు సగంమంది రాజకీయ జీవితం ముగిసినట్లే. ఎంతమందికి టిక్కెట్లు వస్తుందో, ఎంతమంది మాజీలుగానే మిగిలిపోతారో తొందరలోనే తెలిస్తుందిగా?

 

 

loader