Asianet News TeluguAsianet News Telugu

రేపే టిడిపి మ‌హానాడు – ఏర్పాట్లు పూర్తి, పసుపుమయమైన రాజ‌మ‌హేంద్ర‌వ‌రం

తెలుగుదేశం పార్టీ మహానాడుకు రాజమండ్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి . మహానాడుకు దారి తీసే రోడ్లన్నీ పసుపు వర్ణంతో కళకళలాడుతున్నాయి. జాతీయ రహదారి పొడవునా భారీ ఫ్లెక్సీలను, కటౌట్‌లను ఏర్పాటు చేశారు

all set for tdp two days mahanadu in rajamahendravaram ksp
Author
First Published May 26, 2023, 6:05 PM IST

తెలుగుదేశం పార్టీ మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి వద్ద జాతీయ రహదారి సమీపంలో శని, ఆదివారాల్లో మహానాడును నిర్వహించనున్నారు. దాదాపు 38 ఎకరాల విశాలమైన మైదానంలో మహానాడు జరుగుతోంది. పది నుంచి 15 లక్షల మంది కార్యకర్తలు, నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా. అలాగే రక్తదాన శిబిరం,ఫోటో ఎగ్జిబిషన్, ప్రెస్ గ్యాలరీ, భోజనం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్రఖ్యాత వంటకాలతో పాటు గోదావరి జిల్లాల వంటకాలను వడ్డించనున్నారు. మహానాడుకు దారి తీసే రోడ్లన్నీ పసుపు వర్ణంతో కళకళలాడుతున్నాయి. జాతీయ రహదారి పొడవునా భారీ ఫ్లెక్సీలను, కటౌట్‌లను ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రానికి చంద్రబాబు నాయుడు రాజమండ్రి చేరుకోనున్నారు. 

ఈసారి మహానాడుకు ప్రత్యేకత వుంది. టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు కూడా జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే వచ్చే ఎన్నికలకు ముందు జరిగే మహానాడు కావడంతో దీనిని భారీగా నిర్వహించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోను ఇక్కడే ప్రకటించే అవకాశాలు వున్నాయి. గతంలో 2006 మే 27, 28, 29 తేదీల్లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో మహానాడును నిర్వహించారు. 

ALso Read: రాజమండ్రిలో టీడీపీ మహానాడు.. భద్రత కల్పించండి, ఏపీ డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ

ఇదిలావుండగా.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం లేఖ రాశారు. ఈ నెల 27,28 తేదీల్లో రాజమండ్రిలో జరగనున్న టీడీపీ మహానాడుకు బందోబస్తు కల్పించాలని అచ్చెన్నాయుడు కోరారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తుతో పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు తగినంత మంది సిబ్బందిని కేటాయించాల్సిందిగా అచ్చెన్నాయుడు కోరారు. 

మరోవైపు.. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు సంబంధించి, రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమానికి సంబంధించి మహానాడులో 15 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నామన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. గత శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానంగా ప్రజల సమస్యలు, ఈ ప్రభుత్వం 4ఏళ్లలో తీసుకున్న నిర్ణయాల ప్రభావంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మహానాడులోప్రధానంగా చర్చిస్తామని యనమల తెలిపారు. ఇప్పుడు జరిగే మహానాడు ఎన్నికలకు ముందు జరిగేది కాబట్టి ప్రధానాంశాలుంటాయని రామకృష్ణుడు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు టీడీపీ రద్దు చేస్తుంది అనేది అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.  సంక్షేమ పథకాలకు ఆద్యమే తెలుగుదేశం పార్టీ అన్న ఆయన ఎన్.టీ.రామారావు సంక్షేమ పథకాలకు ఆద్యుడని కొనియాడారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios