ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా వైసీసీ శ్రేణులు ఊగిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి కడప జిల్లోలని ఇడుపులపాయకు చేరుకునేందుకు నేతలు, శ్రేణులు తరలి వస్తున్నారు. సోమవారం ఉదయం ఇడుపులపాయలో బహిరంగ సభ తర్వాత జగన్ పాదయాత్ర మొదలవుతుంది. బహిరంగ సభలోను, మొదటిరోజు పాదయాత్రలోనూ పాల్గొనేందుకు రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇన్చార్జిలు రాత్రిలోగా ఇడుపులపాయకు చేరుకుంటున్నారు. వీరితో పాటు ఆయా నియోజకవర్గాలు, జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు కూడా కదలివస్తున్నారు. దాంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ, జగన్మోహన్ రెడ్డి జెండాలు, ఫ్లెక్సీలు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకూ ప్రతిష్టాత్మకంగా మొదలుపెడుతున్న పాదయాత్రలో జగన్ 3 వేల కిలోమీటర్లు కవర్ చేస్తారు. 125 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగుతుంది. దాదాపు 60 లక్షల కుటుంబాలను, 2 కోట్ల మంది ప్రజలను జగన్ కలిసేట్లుగా రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఇవికాకుండా 5 వేల రహదారి సమావేశాలు, 20 వేల ప్రజాసంఘాలతో ప్రత్యేక భేటీలకు కూడా ఏర్పటు చేసారు. నిన్నటి ఉదయం వరకూ కూడా పాదయాత్రకు పోలీసుల అనుమతి వస్తుందో రాదో అన్న అనుమానంతో ఉన్న నేతలు మధ్యాహ్నం తరువాత అనుమతి రావటంతో ఫుల్లు కుషీగా ఉన్నారు.

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలే కాకుండా కోస్తా జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎవరికి వారుగా బహిరంగసభకు వస్తున్నారు. బహిరంగసభ ఏర్పాట్లను కడప ఎంపి అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు.