Asianet News TeluguAsianet News Telugu

బొత్సకు చెక్: ఏకమవుతున్న రాజ వంశీకులు

రాజులంతా సైకిలెక్కితే జిల్లాలో రాజకీయ పరిణామాల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే బొబ్బిలి రాజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 

All are uniting to defeat Botsa Family
Author
Vizianagaram, First Published Feb 5, 2019, 6:33 PM IST

విజయనగరం: తెలుగు రాష్ట్రాల్లో విజయనగరం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు విజయనగరం సామ్రాజ్యంగా పాలన అందించిన జిల్లా విజయనగరం. అందుకే ఈ జిల్లాలో రాజులు, రాజవంశాల చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 

ప్రజాస్వామ్య దేశంలో కూడా వారి ముద్ర చాలా బలంగా ఉంటుంది. అందుకేనేమో ఎన్నికల్లో రాజవంశీయులు బరిలో ఉంటే వారిదే గెలుపు. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, కురుపాం రాజులు సంస్థానాధీశులుగా ఈ జిల్లాలోనే చక్రం తిప్పారు. 

శతాబ్దాల తరబడి రాజ్యాలు ఏలారని చరిత్ర చెప్తోంది. రాజ్యాలు అంతరించిపోయి ప్రజాస్వామ్యం రావడంతో ఇప్పుడు ఆ రాజకుటుంబీకులు అంతా వివిధ పార్టీలలో చేరి జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఒకప్పుడు రాజ్యాలు ఏలిన ఈ రాజకుటుంబీకుల వారసులాంతా ఒకే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజుల రాజకీయమంతా కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రారంభమైంది. 

ప్రస్తుతం కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనందగజపతిరాజు, తండ్రి పీవీ రాజులు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు సైతం చేపట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో సైకిలెక్కేశారు. ఆనాటి నుంచి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూసపాటి వంశీయులే పెద్ద దిక్కుగా ఉన్నారు. 

ఇకపోతే బొబ్బిలి రాజులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం భూగర్భగనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న సుజయ్ కృష్ణ రంగారావు తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి గెలుపొందారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రిగా కొనసాగుతున్నారు. 

ఇకపోతే కురుపాం రాజులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ ఆరంగేట్రం చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో శత్రుచర్ల విజయరామరాజు మంత్రిగా కూడా పనిచేశారు. రెండున్నరేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి సైకిల్ ఎక్కేశారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కూడా.  

ఇకపోతే గమ్మత్తైన విషయం ఏంటంటే బొబ్బిలి యుద్ధం నాటి నుంచి బొబ్బిలి రాజులకు, విజయనగరం రాజులు అయిన పూసపాటి వంశీయులకు వైరం ఉండేది. ఆవైరం రాజకీయాల్లో కూడా కొనసాగించారు వారి వారసులు. 

అయితే  సుజయకృష్ణ రంగారావు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి అటునుంచి మూడేళ్ళ క్రితం సైకిలెక్కేశారు. దాంతో శతాబ్దాల నాటి వైరానికి స్వస్తి చెప్పారు. ఇక విజయనగరం రాజకీయాల్లో బొబ్బిలి రాజులు, విజయనగరం రాజులు ఒకే గూటికి చేరినట్లైంది. 

మరోవైపు కురుపాం రాజులులో వైరిచర్ల కిషోర్ చంద్రసూర్యనారాయణ దేవ్ ఒకరు. ఈయన కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కీలక నేతగా ఎదిగారు. సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. 

కేంద్రమంత్రిగా జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆయన కూడా పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. త్వరలోనే ఆయన సైకిలెక్కుతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కేంద్రమాజీమంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి సుజయ్ కృష్ణరంగరావులు పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు. 

ఇకపోతే విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగువెలిగిన మరోరాజు పెనుమత్స సాంబశివరాజు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దూసుకుపోతున్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాజకీయ ఓనమాలు దిద్దింది ఈయన దగ్గరేనని ప్రచారం కూడా ఉంది.  

కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామని ఆశించారు. ఆ నియోజకవర్గానికి బొత్స బంధువు బడుకొండ అప్పలనాయుడును సమన్వయకర్తగా నియమించడంతో ఆయన అలకబూనారు. 

పెనుమత్స సాంబశివరాజు కూడా పార్టీ వీడతారంటూ ప్రచారం జరుగుతుంది. కేంద్రమాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయనను తెలుగుదేశం పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. 

పెనుమత్స సాంబశివరాజు నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చెయ్యగల నేత కావడంతో అతనని పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ గేలం వేస్తోందని సమాచారం. 

రాజులంతా సైకిలెక్కితే జిల్లాలో రాజకీయ పరిణామాల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే బొబ్బిలి రాజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 

అటు కురుపాం రాజవంశీయులైన శత్రుచర్ల కుటుంబం నుంచి శత్రుచర్ల విజయరామరాజు సోదరుడు వైసీపీకి గుడ్ బై చెప్పగా తనయుడు పరీక్షిత్ రాజు ఆయన భార్య ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మాత్రమే ఉన్నారు. 

ఈ నేపథ్యంలో పెనుమత్స సాంబశివరాజును కూడా కోల్పోతే వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అయితే వైఎస్ జగన్ మాత్రం బొత్స సత్యనారాయణపై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios