అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అక్షయపాత్ర ట్రస్టు సభ్యులతో సీఎం భేటీ అయ్యారు. 

మధ్యాహ్న భోజన పథకం పై అక్షయపాత్ర ట్రస్ట్ సభ్యులు, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో భోజన, తాగునీరు, వసతులు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకుగాను సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. 

పాఠశాలలకు అవసరమయ్యే మౌళిక సదుపాయాలను, వసతులను వెంటనే కల్పించాలని కోరారు. భోజనం, తాగునీరు, వసతుల విషయంలో ఎక్కడా రాజీపడొద్దన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. మళ్లీ సమావేశంలోపు పూర్తి స్థాయి ప్రణాళికలతో హాజరుకావాలని సీఎం వైయస్ జగన్  అధికారులను ఆదేశించారు.