సంక్రాంతి పండగ అంటే ప్రధానంగా గుర్తుకువచ్చేవాటిలో కోడి పందాలు (cockfight) కూడా ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలో (Godavari districts) ఈ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ ఏడాది ఐటీ ఉద్యోగులు (IT Employees) కూడా పెద్ద మొత్తంలో కోడి పందాల్లో పాల్గొనాలని చూస్తున్నారు. 

సంక్రాంతి పండగ అంటే ప్రధానంగా గుర్తుకువచ్చేవాటిలో కోడి పందాలు (cockfight) కూడా ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలో (Godavari districts) ఈ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. పండగకు కొద్ది రోజుల ముందు నుంచే కోడి పందాల సందడి నెలకొంటుంది. కోడి పందాల కోసం సంక్రాంతికి కొన్ని నెలల ముందు నుంచే పందెం కోళ్లను సిద్దం చేస్తుంటారు. వాటి మీద భారీగా ఖర్చు చేస్తుంటారు. మరికొందరైతే పందెం కోళ్లను పెంచి.. వాటిని భారీ ధరలకు విక్రయిస్తుంటారు. గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలను చూసేందుకు.. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి ఎన్నారైలు తరలివస్తారు. కోడి పందాల్లో డబ్బు సంపాదించాలని కొందరు, తమ సత్తా చాటాలని మరికొందరు పుంజులను బరుల్లోకి దింపుతారు.

కోడి పందాల్లో ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. ముఖ్యంగా పండగ మూడు రోజులు నిర్వహించే పందాల్లో ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఐటీ నిపుణులు (IT sector) కూడా పెద్ద మొత్తంలో కోడి పందాల్లో పాల్గొనాలని చూస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో గత రెండేళ్ల నుంచి చాలా మంది ఐటీ ఉద్యోగులు.. ఇంటి నుంచే విధులను నిర్వర్తిస్తున్నారు. చాలా మంది రిలాక్స్ కావడానికి.. బయటి ప్రదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారు. 

ఈ క్రమంలోనే కొందరి దృష్టి గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందాల వైపు మళ్లింది. ఈసారి పండగకు వీకెండ్‌ కూడా తోడు కావడంతో ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చని వారు భావిస్తున్నారు. ఇందుకోసం వారు ఆ ప్రాంతంలో ఉన్న తమ ఫ్రెండ్స్‌తోని, తెలిసినవారితోని సంప్రందింపులు జరుపుతున్నారు. మరోవైపు గోదావరి జిల్లాలకు చెందిన ఐటీ ఉద్యోగులు.. చాలా కాలంగా ఇంటి వద్దే ఉండటంతో ఈసారి కోడి పందాల్లో పాల్గొనాలని చూస్తున్నారు. కొందరు ఐటీ ఉద్యోగులు ఇంటి దగ్గరే ఉండటంతో పందెం కోళ్లను పెంచి.. విక్రయాలు కూడా జరుపుతున్నారు. 

చాలా మంది ఐటీ ఉద్యోగులు రహస్యంగానైనా కోడి పందాల్లో పాల్గొనాలని కొందరు, తమకు తెలిసినవారి ద్వారా డబ్బులు పెట్టాలని మరికొందరు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక, భీమవరం మండలంలోని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. రెండు కోళ్లను లక్ష రూపాయల చొప్పున విక్రయించాడంటే కోడి పందాల క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, గత కొంతకాలంగా ఐటీ ఉద్యోగులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కోడి పందాల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఈ సారి ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

భీమరం మండలానికే చెందిన కోడి పందాల ఆటలో పాల్గొనే ఓ వ్యక్తి మాట్లాడుతూ.. సంక్రాంతి పండగకు వీకేండ్ తోడవ్వడంతో చాలా మంది పండగను ఆస్వాదించాలని, దానితో పాటు డబ్బు సంపాదించాలని కోరుకుంటారని తెలిపారు. ఒమిక్రాన్ దృష్ట్యా లాక్‌డౌన్ ఉంటే తప్ప.. లేకుంటే కోడిపందాలు జరుగుతాయని చెప్పారు. 

రెండేళ్లుగా కోవిడ్ కారణాలతో నిర్వహకులు.. భారీగా ఆదాయం ఆశించినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే గతంలో కోడిపందాలు నిర్వహించినవారిపై ముందస్తుగా పోలీసులు బైండోవర్ కేసులు బుక్ చేస్తున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం తాము పండగ జరిగే మూడు రోజులు సంప్రదాయ క్రీడను నిర్వహిస్తామని చెబుతున్నారు.

సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో కోడిపందాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో హైకోర్టు ఆదేశాల మేరకు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పోలీసు, రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నాయి. కోడి పందేలు, పేకాట, గుండాటలు ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.