తాడేపల్లి: దాళ్వా, సార్వాకు... దుక్కికి, దమ్ముకు తేడా తెలియని వ్యక్తులు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారంటూ టిడిపి నాయకులపై ఏపి వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా వ్యవసాయం గురించి లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.  

రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చంద్రబాబు ఎనాడూ తన క్యాబినెట్ లో వ్యవసాయం గురించి ఒక గంట కూడా చర్చించలేదని అన్నారు. అలాంటి వ్యక్తి  ప్రస్తుతం రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో వున్నా రైతుల కోసం ఆలోచిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా వుందన్నారు. 

గత సంవత్సరం కంటే ప్రస్తుతం పంటలు చాలాబాగా పండాయన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 14.70 శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని... 2019-20 సంవత్సరంలో పంటల దిగుబడి అధికంగా ఉందన్నారు. గతేడాది కంటే ఈ ఖరీఫ్ లో నాలుగు లక్షల టన్నుల ధాన్యం అధికంగా సేకరించామని నాగిరెడ్డి వెల్లడించారు. 

రైతుల మద్దతు ధర గురించి టీడీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మద్దతు ధర లేదని టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎగొట్టిన రూ.1100 కోట్ల ఇన్ ఫుట్  సబ్సిడీని సీఎం జగన్ ఇచ్చారని ఈ సందర్భంగా నాగిరెడ్డి గుర్తుచేశారు. 

దేశంలో ఎక్కడ లేని విధంగా అధికారులే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి మద్దతు కల్పిస్తున్నారని... రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ రైతు బజార్లు ఏర్పాటు చేశారన్నారు. దేశవ్యాప్తంగా ఐదు వేలు ఇవ్వాలని మోడీని చంద్రబాబు ఎందుకు అడగడం లేదు? అని ప్రశ్నించారు. 

దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఐదు వేలు రూపాయలు ఇస్తున్నాయి? అంటూ ప్రతిపక్ష నేతను నిలదీశారు నాగిరెడ్డి. ఏపిలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న చంద్రబాబు ఈ విపత్కర సమయంలో హైదరాబాద్ ఇంట్లో దాక్కున్నాడని అన్నారు. మాజీ మంత్రి లోకేష్ సైకిల్ తోక్కుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని నాగిరెడ్డి విమర్శించారు.