అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేస్తూ వైసిపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలతో  కూడిన అధికారిక ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర, జిల్లా, మండలి స్థాయిల్లో సలహా బోర్డుల నియామకం చేపడుతున్నట్లు ఈ జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి సలహా బోర్డు ఛైర్మన్ గా వ్యయసాయశాఖ మంత్రి, జిల్లాస్థాయి సలహా బోర్డు చైర్మన్ గా జిల్లాకు చెందిన మంత్రి, మండలస్థాయి సలహా బోర్డు ఛైర్మన్ గా స్థానిక ఎమ్మెల్యే  వ్యవహరించనున్నారు. 

ఈ సలహా మండలి వ్యవసాయ ప్రణాళిక రూపకల్పన, జిల్లా వ్యవసాయ ప్రణాళికలను ఆమోదించనుంది. మార్కెట్ ఇంటిలిజెన్స్, కేంద్రంతో సంప్రదింపులపై కార్యాచరణ చేపట్టనుంది. వ్యవసాయ, మార్కెటింగ్ రంగాలకు ఊతమిచ్చేలా బోర్డులకు బాధ్యతలు  అప్పగించారు. 

వచ్చేఏడాది జనవరి 17వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల ప్రారంభించనున్నట్లు ఇప్పటికే వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. ఈ తేదీనాటికి 3300 రైతు భరోసా కేంద్రాలను, ఫిబ్రవరిలో మరో 5వేల కేంద్రాలు, ఏప్రిల్‌ నాటికి మొత్తం 11,158 కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారులు పనులు చేపట్టాలని సూచించారు. 

read more   వ్యవసాయం ‘సంస్కరణ’.. కార్పొరేట్లకు ఉద్దీపనకు వ్యూహం

ఈ కేంద్రాల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయరంగంలో వినియోగించే ఉత్పత్తలను రైతులకు సరసమైన ధరలకు  అమ్మాలని ముఖ్యమంత్రి వ్యవసాయ అధికారులకు సూచించారు. అలాగే రైతులకు సలహాలు, శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు అందిస్తున్న వివిధ పథకాలను సక్రమంగా అందించడంలో కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. 

రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ దిగుబడులను పెంచడం, రైతులకు ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తాయన్నారు. ఈ కేంద్రాలు దశలవారీగా విత్తన పంపిణీ, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లగా కూడా వ్యహరించనున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రంలో తమకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులను ఆర్డర్‌ ఇవ్వడానికి రైతులు డిజిటల్‌ కియోస్క్‌ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. 

 విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, బయోఫెర్టిలైజర్స్, అగ్రి కెమికల్స్, పశుదాణా ఇతరత్రా ఉత్పత్తుల ఆర్డర్‌ కియోస్క్‌ ద్వారానే అందించాలని సూచించారు.  
 విత్తనాలు నిల్వచేసే గోడౌన్లలో కూడా నాణ్యతా పరీక్షలు చేయాలని....జిల్లా కేంద్రాల్లో కూడా పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.