అమరావతి: వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకంపై జిల్లాల కలెక్టర్లతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్‌ .జగన్‌ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే  కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకొంది.  

ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం – సర్వే ఆఫ్‌ ఇండియా కలిసి రాష్ట్రంలో ప్రతి భూమిని సమగ్ర సర్వే చేస్తాయన్నారు. 
చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే కార్యక్రమంగా ఆయన పేర్కొన్నారు.దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో సర్వే చేస్తున్నామన్నారు.

ఇంటి స్థలం కానివ్వండి, పొలం కానివ్వండి, మరో స్తిరాస్థి కానివ్వండి ...దాని మీద ఒక టైటిల్‌ ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు అబ్జర్వేషన్‌లో అదే గ్రామ సచివాలయంలో పెడతామని సీఎం తెలిపారు. 

ఆ టైటిల్‌ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు.రెండేళ్ల తర్వాత టైటిల్‌కు శాశ్వత భూహక్కు లభిస్తుందని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత  కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుందన్నారు.

100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోంది. 100 ఏళ్లలో సబ్‌ డివిజన్లు, పంపకాలు క్షేత్రస్థాయిలో నమోదు కాని పరిస్థితి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 
వాటన్నింటినీ రికార్డుల్లోకి ఎక్కిస్తాం, రాళ్లు కూడా వేస్తాం. తర్వాత యూనిక్‌ ఐడెంటింటీ నంబర్‌తో కార్డు కూడా ఇస్తామని ఆయన చెప్పారు.
 ఆ కార్డులో క్యూర్‌ఆర్‌ కోడ్‌ఉంటుంది, హార్డ్‌కాపీ కూడా ఇస్తారని సీఎం తెలిపారు.

ల్యాండ్‌ పార్సిళ్లు, మ్యాపులు కూడా గ్రామంలో అందుబాటులో ఉంచుతామన్నారు. రికార్డులన్నింటినీ కూడా డిజిటలైజేషన్‌ చేయనున్నట్టు చెప్పారు.విలేజ్‌ హాబిటేషన్స్‌కు సంబంధించిన మ్యాపులు కూడా అందుబాటులోకి తీసుకొస్తారన్నారు.

ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్‌ ఇండియా కలిసి 70 బేస్‌ స్టేషన్లు పెడుతున్నామన్నారు.సర్వే ఆఫ్‌ ఇండియా నెట్‌వర్క్‌లో ఇవి భాగం అవుతాయన్నారు.కచ్చితమైన కొలతలు ఉంటాయి. ఎర్రర్‌ అత్యంత సూక్ష్మస్థాయిలో 2 సెం.మీ.కు అటు ఇటుగా ఉంటుందన్నారు.

1.26 లక్షల చదరపు కిలోమీటర్లు సర్వే చేస్తున్నారని చెప్పారు. మొదటి ఫేజ్‌ డిసెంబర్‌ 21న ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. 5 వేల రెవిన్యూ గ్రామాల్లో ప్రారంభమై,జులై 2021 వరకూ మొదటి విడత సాగుతుందని సీఎం తెలిపారు.

ఆగస్టు 2021 నుంచి 6500 రెవిన్యూ గ్రామాల్లో రెండోవిడత ప్రారంభం కానుందన్నారు. రెండో విడత 2022 ఏప్రిల్‌ వరకూ కొనసాగుతుందని ఆయన వివరించారు.
మిగిలిన గ్రామాల్లో జులై 2022 నుంచి జనవరి 2023 వరకూ కొనసాగుతుందన్నారు సీఎం.

 మొదటి విడత పూర్తై, రెండో విడత ప్రారంభం అయ్యేలోపే సంబంధిత గ్రామ సచివాలయాలలో సబ్‌ రిజిస్ట్రార్‌ సేవలు అందుతాయి. అక్కడే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని సీఎం చెప్పారు.

సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం 14వేల సర్వేయర్లను  నియమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 9400 మంది ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్నారన్నారు. జనవరి 26 కల్లా మిగిలిన వారికి ట్రైనింగ్‌ పూర్తవుతుందని సీఎం తెలిపారు. 

 సర్వే వల్ల జరిగే మంచి ఏంటి? లాభాలు ఏంటన్న దానిపై ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.గ్రామ, వార్డు వాలంటీర్ల సహాయంతో ప్రతి ఒక్కరికీ అవన్నీ తెలిసేలా చేయాల్సిందిగా కోరారు.డిసెంబర్‌ 14 నుంచి 19 వరకూ గ్రామ సభలు కూడా పెట్టాలని సీఎం సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సహానీ, సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌తో పాటు, సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.