Asianet News TeluguAsianet News Telugu

’దేశానికి‘కాపులు దూరమవుతున్నారా ?

  అసలు, ఆందోళన  అంటేనే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించటం. దానికి మళ్ళీ పోలీసు అనుమతి ఏమిటో చంద్రబాబు ప్రభుత్వానికే తెలియాలి.

agitations

కాపులకు, ప్రభుత్వానికి మధ్య అగాధం పెరుగుతోందా? కాపు నేతల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రిజర్వేషన్ల అంశంపై పాదయాత్ర చేయాలనుకుంటున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం తదితరులకు ప్రభుత్వం అనుమతి నిరాకరించటమే ఇందుకు నిదర్శనం. కాపులకు రిజర్వేషన్ కల్పించటంలో ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణిని నిరసించాలని కాపు నేతలనుకున్నారు. ఇందులో సహజంగానే కాపు ఉద్యమాలకు ప్రస్తుతం కేంద్రబిందువుగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో పాదయాత్ర జరపాలని అనుకున్నారు.

  ముద్రగడ అనగానే ప్రభుత్వానికి ‘తుని’ రైలు దహనం ఘటనే గుర్తుకు వస్తున్నట్లుంది. అందుకనే పాదయాత్ర, దీక్షలు, ర్యాలీ ఆందోళన ఏ రూపంలో ఉన్న ఎవరు చేయదలచుకున్నా అనుమతించేది లేదని డిజిపి సాంబశిరావు స్పష్టం చేసారు. దాంతో కాపు సామాజిక వర్గానికి, ప్రభుత్వానికి మధ్య అగాధం  పెరుగుతోందని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే, తాము ఆందోళన చేసుకుంటామంటే ఏ ప్రభుత్వమైనా అనుమతి ఇస్తుందా? ఇంత  చిన్న విషయం కూడా ప్రభుత్వ పెద్దలకు తెలీదా అని కాపులు ప్రశ్నిస్తున్నారు.

  అసలు, ఆందోళన  అంటేనే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించటం. దానికి మళ్ళీ పోలీసు అనుమతి ఏమిటో చంద్రబాబు ప్రభుత్వానికే తెలియాలి. అనుమతి పేరుతో ఆందోళనలను ప్రధానంగా కాపు సామాజిక వర్గాన్ని అణిచివేయటానికే ప్రభుత్వం నిర్ణయించినట్లు కనబడుతోందన్న ఆరోపణలు వినబడుతున్నాయి. గడచిన ఎన్నికల సమయంలో కాపులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని స్వయాంగా చంద్రబాబే హామీ ఇచ్చారు.

ఏడాది పాటు వేచి చూసిన కాపు సామాజిక వర్గం ముద్రగడ ఆధ్వర్యంలో ఆందళనలు మొదలుపెట్టింది. ఆ నేపధ్యంలోనే తునిలో రైలు దహనం, ఆ తర్వాత పలుమార్లు ముద్రగడ దీక్షలకు దిగటం, రైలు దహనం కేసులో సంబంధంలేని పలువురు కాపు నేతలను అరెస్టులు చేయటం అందరికీ తెలిసిందే.

  ప్రస్తుత పరిస్ధితిలో కాపులంటేనే ప్రభుత్వానికి ఒక్క ముద్రగడే కనిపిస్తున్నారేమో అని పలువురు అనుమానిస్తున్నారు. అందుకనే కాపుల్లో ఎవరు ఆందోళన చేద్దామనుకున్న మొత్తం సామాజిక వర్గాన్ని ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడుతున్నారు. అయితే, అధికార పార్టలోని నేతలు చెప్పేదాన్ని బట్టి కాపు నేతల్లో కొందరిని చంద్రబాబు తనవైపుకు తిప్పుకున్నట్లు కనబడుతోంది.

అయితే, ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న కాపు నేతల్లో జనబలం ఉన్న వారెందరన్నదే ప్రశ్న. చూడబోతే భవిష్యత్తులో ముద్రగడ ఆధ్వర్యంలో కాపు సామాజిక వర్గం చేపట్టే ఏ కార్యక్రమానికి కూడా అనుమతులు వచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది.

  కులాల సమీకరణల విషయంలో ఎంతో ఆరితేరిపోయిన చంద్రబాబు కోరి కాపు సామాజక వర్గంతో ఎందుకు వైరం పెట్టుకుంటున్నారో అర్ధం కావటం లేదని పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఆందోళనలకు ప్రభుత్వ అనుమతి కావాలని చెబుతున్న చంద్రబాబు గతంలో ప్రతిపక్ష నేతగా తాను చేసిన పలు ఆందోళనలకు ప్రభుత్వం అనుమతి తీసుకునే చేపట్టారా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఆందోళనల పేరుతో మహారాష్ట్ర సరిహద్దుల్లోకి వెళ్లినపుడు తనకు జరిగిన సత్కారాన్ని చంద్రబాబు మరచిపోయినట్లు కనబడతోందని వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios