రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి రూరల్ మండలంలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తికి క్వారంటైన్ వెళ్లి వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్  రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

రాజమండ్రి రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఢిల్లీలోని మర్కజ్ లో జరిగిన ప్రార్ధనల్లో పాల్గొని వచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కానీ ఆ సమయంలో అప్పట్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. అయినా కూడ ఆయనను క్వారంటైన్ కు తరలించారు.

క్వారంటైన్ నుండి ఆయనను డిశ్చార్జ్ చేశారు. క్వారంటైన్ నుండి వచ్చిన తర్వాత ఆయనకు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది. దీంతో ఆయనను వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా నుండి ఢిల్లీలో మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొని వచ్చిన వారందరికీ మరోసారి టెస్టులు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుంది.