అమరావతి: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన వెంటనే మొట్టమొదట ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో రైలు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. అయితే ఇటీవల వలసకూలీలను స్వస్థలాలకు తరలించడానికి కొన్ని రైళ్లను నడుపుతున్నారు. ఇందులో భాగంగా లాక్  డౌన్ తర్వాత మొదటిసారి విజయవాడలో రైలు కూత మొదలవనుంది. 

మధ్యాహ్నం 2.30 గంటలకు న్యూఢిల్లీ- చెన్నై స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు విజయవాడ స్టేషన్ కు చేరుకోనుంది. ఈ రైల్లో ఢిల్లీ నుంచి విజయవాడకు 300 మంది ప్రయాణికులు రానున్నారు. ఇదే రైల్లో విజయవాడ నుంచి చెన్నైకి 300 మంది వెల్లనున్నారు. విజయవాడ నుండి చెన్నైకి వెళ్లే ప్రయాణికులు గంట ముందుగానే రైల్వే స్టేషన్ చేరుకోవాలని రైల్వే శాఖ అధికారులు సూచించారు.

అలాగే ఢిల్లీ నుంచి వచ్చే మూడు వందల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చకుండా మొదట క్వారంటైన్ సెంటర్లకు తరలించనున్నారు. అందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఎందరో ప్రజలు ఎక్కడెక్కడో చిక్కుబడిపోయారు. వీరి పరిస్థితి అర్థం చేసుకున్న కేంద్రం వలస కార్మికులను, చిక్కుబడిపోయిన వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి తొలి ప్రత్యేక శ్రామిక్ రైలు ఝార్ఖండ్ కి వెళ్లగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తొలి రైలు 1212 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలోని చంద్రాపూర్ కి వెళ్లింది. ప్రయాణికుల మధ్య భౌతిక దూరాన్ని కొనసాగిస్తూ ప్రయాణికులను రైల్లో ఎక్కించి పంపిస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్.