వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నిజమే.. జగన్‌కు అనుభవం లేదు : ఆదోనీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా ఆదోనీ వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్న మాట వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ అనుభవలేమితోనే ఇలా జరుగుతోందని సాయిప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తమతో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. దీనిని వైసీపీ నేతలు ఖండిస్తున్నా.. ఎక్కడో తెలియని భయం వారిని వెంటాడుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో పాటు అంతకుముందు నుంచే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోనీ వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. నాయకులతో ఎలా వుండాలన్న దానిపై జగన్ అనుభవం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రెండోసారి సీఎంగా అవకాశమిస్తే జగన్‌కు పూర్తి అవగాహన వస్తుందని సాయిప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతతం ఆయన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి.
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే కోటాలో ఒకటి, పట్టభద్రుల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడంతో.. అధికార వైసీపీకి షాక్ తగిలింది. అయితే ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ అధిష్టానం వారిని సస్పెండ్ కూడా చేసింది. ఆ నలుగురిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఉన్నారు. వీరిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతకాలంగా వైసీపీకి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తుండగా.. ఆ జాబితాలో తాజాగా మరో ఇద్దరు కూడా చేరినట్టయింది.
Also Read: టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు, సైకోతత్వం: జగన్ పై బాలకృష్ణ సంచలనం
ఈ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. మరోవైపు వైసీపీలో మరింత మంది అసంతృప్తులు ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారనే ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి.