Asianet News TeluguAsianet News Telugu

ఆన్‌లైన్ క్లాసులు ప్రత్యక్ష తరగతులకు ప్రత్యామ్నాయం కాదు.. అందుకోసమే ఈ చర్యలు.. మంత్రి ఆదిమూలపు సురేష్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) తెలిపారు. స్కూల్స్ తెరవడానికి.. కరోనా వ్యాప్తికి సంబంధం లేదని అన్నారు. 

adimulapu suresh comments school holidays and online classes
Author
Amaravati, First Published Jan 17, 2022, 4:13 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 7 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగిందన్నారు. 4 కోట్ల మందికి తొలి డోసు, 3 కోట్ల మందికి రెండో డోసు ఇచ్చినట్టుగా చెప్పారు. పాఠశాలల్లో టీచర్లందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టుగా తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఏ అంశం దొరక్క విద్యా వ్యవస్థను రాజకీయం చేస్తున్నాయని విమర్శిచారు. 

స్కూల్స్ తెరవడానికి.. కరోనా వ్యాప్తికి సంబంధం లేదని అన్నారు. స్కూళ్లలో కరోనా కేసులు వస్తే శానిటైజ్ చేస్తున్నామని తెలిపారు. కరోనా వల్ల గత రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అనుసరించామని.. భవిష్యత్తులో విద్యార్థులకు ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదన్నారు. ఆన్‌లైన్ క్లాసులు ప్రత్యక్ష తరగతులకు ప్రత్యామ్నాయం కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. పొరుగు రాష్ట్రాలతో పోలికలు అనవసరమని చెప్పారు. గత 150 రోజులుగా నిరంతరాయంగా పాఠశాలలు నడిచాయని.. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరి అత్యవసరమైతే.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదని.. పరీక్షలు నిర్వహించేలా పాఠశాలల్లో బోధన జరుగుతోందని తెలిపారు. పిల్లలు ఇంట్లో ఉన్న, బయట ఉన్న వారిలో లక్షణాలు గుర్తించలేమని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఆన్‌లైన్ క్లాస్‌లు ఒక లెవల్ వరకే పరిమితం అవుతాయని అన్నారు. ఆన్‌లైన్ క్లాసులు ఉన్నత విద్యకు కొంతవరకు ఉపయోగపడొచ్చు.. కానీ ప్రాథమిక విద్యకు, మాధ్యమిక విద్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయం కాదన్నారు. ఆన్‌లైన్ క్లాసులను ఒక మార్గంగా ఎంచుకుని స్కూల్స్‌ను మూసివేయడం అనేది కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. 

ఇక, రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులను పొడిగించే ఆలోచన లేదని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Adimulapu suresh ఆదివారం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగియడంతో పాఠశాలలు నేడు తెరుచుకున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios