రోజాను సవాలు చేసే నేతను మొత్తానికి తెలుగుదేశంపార్టీ వెతికి పట్టుకున్నట్లే ఉంది. ఎందుకంటే, ఇంతకాలం వైసీపీ ఎంఎల్ఏ రోజా ధాటికి సరిపోయేవారు టిడిపిలో ఎవరూ లేరనే కొరత అందరినీ వేధిస్తోంది. అందుకనే టిడిపి నేతలు వెతికి ఒకప్పటి అందాల తార వాణి విశ్వనాధ్ ను పట్టుకున్నారు. వాణి కూడా టిడిపిలో చేరిన తర్వాత రోజాపై పోటీకి సై అంటోంది. చంద్రబాబునాయుడు సమక్షంలో మంగళవారం టిడిపి కండువా కప్పుకోవటానికి అమరావతికి చేరుకున్నట్లు సమాచారం.

ఇదే విషయమై వాణి మీడియాతో మాట్లాడుతూ, తాను మంగళవారం టిడిపిలో చేరనున్నట్లు చెప్పారు. అలాగే నగిరి నియోజకవర్గంలో రోజాపై పోటీకి కూడా సవాలన్నారు. వాణి టిడిపిలో చేరుతారని, నగిరిలో రోజాపై పోటీ చేస్తారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, పార్టీలో చేరుతున్న విషయాన్ని గతంలోనే వాణి ధృవీకరించినా పోటీ విషయంలో మాత్రం గోప్యంగా ఉన్నారు. అటువంటిది వాణినే స్వయంగా రోజాపై పోటీకి సవాలంటున్నారంటే తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఇంతకాలం నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పని గోవిందానే.