తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆ పార్టీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి మరోసారి ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో జరిగిన భేటీ గురించి ప్రస్తావించారు. 

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆ పార్టీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి మరోసారి ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో జరిగిన భేటీ గురించి ప్రస్తావించారు. లోపల ఏం జరిగింది.. చంద్రబాబుతో ఏం మాట్లాడానో ఈ రోజు ప్రెస్‌మీట్‌లో తెలియజేస్తాననని చెప్పారు. మర్యాదను తట్టుకోలేక పోతున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇక, ఇటీవల టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ట్వీట్ చేసిన దివ్యవాణి.. ఆ తర్వాత కొద్దిసేపటికే దానిని డిలీట్ చేశారు. తాను టీడీపీలోనే ఉంటున్నాననే సంకేతాలు పంపారు. ఈ క్రమంలోనే ఆమె బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో తనకు జరిగిన అవమానాలను, ఇబ్బందులను ఆయనకు ఆమె వివరించారు. 

చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ.. తనపై విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయం తెలియదని విమర్శించిన వారికి కూడా కృతజ్ఞతలు చెప్పారు. తనను సస్పెండ్ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరబడి ట్వీట్ పెట్టానని.. తప్పుడు ప్రచారాలకు తొందరపడొద్దని చంద్రబాబు సూచించారని దివ్యవాణి తెలిపారు. పార్టీలో ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని.. టీడీపీలో చేరిన నాటి నుంచి తన వంతు కృషి చేశానని ఆమె వెల్లడించారు. 

అయితే కొద్ది గంటల్లోనే ఏం జరిగిందో తెలియదు గానీ.. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా దివ్యవాణి ఓ వీడియో విడుదల చేశారు. ‘‘ రాష్ట్ర ప్రజలకు నా నమస్కారం. టీడీపీ అభిమానులకు, కార్యకర్తలకు, పార్టీ ద్వారా నన్ను అభిమానించిన అందరికి హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని రోజులుగా పరిణామాల నేపథ్యంలో బాబు గారిని కలవడం జరిగింది. ఇందుకోసం మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ ఆఫీసుకు వెళ్లాను. ఆయనను కలిసేసరికి రాత్రి 7.45 గంటలకు అయింది. బయటికొచ్చేసరికి 8.30 గంటలు అయింది. ఆ సమయంలో టైమ్ లేకపోవడం వల్ల నేను హడావుడిగా మాట్లాడాల్సి వచ్చింది. 

లోపల ఏం జరిగింది.. సార్ నేను ఏం మాట్లాడింది.. ప్రెస్‌మీట్‌లో పరిపూర్ణంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. వారి మర్యాదను తట్టుకోలేక.. అక్కడ జరిగింది చూడలేక నేను టీడీపీకి రాజీనామా చేస్తున్నాను. ప్రెస్‌ మీట్‌లో అన్ని విషయాలను చెబుతాను’’ అని దివ్యవాణి పేర్కొన్నారు. 

Scroll to load tweet…


నాటకీయ పరిణామాలు..
దివ్యవాణి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు టీడీపీలో చేరారు. టీడీపీ‌లో యాక్టివ్‌గా ఉంటున్న దివ్యవాణి.. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు. టీడీపీపై వైసీపీ మహిళా నేతలు చేసే వ్యాఖ్యలపై ఆమె ఎదురుదాడి చేస్తుంటారు. టీడీపీ కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూడా ఆమె నివాళులర్పించారు. ఆ సమయంలో కూడా టీడీపీ గురించి ఆమె గొప్పగా మాట్లాడారు. 

అయితే ఒంగోలులో జరిగిన మహానాడు తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివ్యవాణి.. తనకు అవమానం జరిగిందని ఆరోపించారు. పార్టీ తీరుపై సంచలన కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే మే 31న పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ట్వీట్ చేశారు. టీడీపీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్టుగా దివ్యవాణి చెప్పారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా చెప్పారు. తర్వాత కొద్దిసేపటికే ఆ ట్వీట్‌‌ను దివ్యవాణి డిలీట్ చేశారు. తనను సస్పెండ్‌ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరపడి ట్వీట్‌ పెట్టానని దివ్యవాణి తెలిపారు.