అమరావతి: మహిళలు ఆత్మరక్షణ కోసం కరాటేలాంటి విద్యలు నేర్చుకుంటే అఘయిత్యాల బారి నుంచి తప్పించుకోవచ్చునని స్పష్టం చేశారు సినీనటుడు సుమన్. విజయవాడలోని మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో డా.వైయస్సార్ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన సుమన్ ఆడపిల్లల ఆత్మరక్షణ కోసం కరాటే తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. 

హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ప్రతీ మహిళ కరాటే నేర్చుకుంటుందని అందువల్లే అక్కడ అత్యాచార ఘటనలు, మహిళలపై దాడులు అరుదుగా జరుగుతుంటాయని తెలిపారు. మహిళల ఆత్మరక్షణ కోసం ఈ కరాటే విద్యను నేర్చుకునేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు. 

ఆడపిల్లలకు కరాటే నేర్పే అంశంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించానని అయితే దొరకలేదన్నారు. 

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలంటూ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణిని కోరారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు హీరో సుమన్.

 

రాష్ట్రంలో ఐదు మందికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం మంచి పరిణామమన్నారు. అందులో మహిళకు కూడా ఉప ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడం చూస్తుంటే జగన్ కు మహిళలపట్ల ఉన్న గౌరవానికినిదర్శనమంటూ కొనియాడారు. 

ఇకపోతే దిశ లాంటి సంఘటనలు జరగక ముందు నుంచే మహిళలకు ఆత్మరక్షణ కోసం కరాటేలాంటి విద్యల్లో శిక్షణ ఇవ్వాలని తాను ప్రభుత్వాలను కోరుతున్నట్లు తెలిపారు. ఆడపిల్లలకు ఆత్మరక్షణ శిక్షణ 6వ తరగతి నుంచే తప్పనిసరి చేయాలని కోరారు. 

ఆడపిల్లలకు కరాటే విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలస్యం చేయకూడదన్నారు. హర్యానా పంజాబ్ లాంటి ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో ఆత్మరక్షణ విద్యలను అభ్యసించిన మహిళలు ఎంతో ధృఢంగా ఉంటారని, ఆ ప్రాంతాల్లో అత్యాచారఘటనలు కూడా అరుదుగానే జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు నటుడు సుమన్.