Asianet News TeluguAsianet News Telugu

ప్యూన్లు, బంట్రోతుల నుంచి విముక్తి: జగన్ కు ఆర్ నారాయణ మూర్తి హ్యాట్సాఫ్

తమ తరంలో ఇంగ్లీష్‌ మీడియంలో చదివినవాళ్లు ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలుగు మీడియంలో చదివితే బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్యూన్లు, బంట్రోతులు మాత్రమే అవుతారని ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. 
 

actor r narayanamurthy praises ap cm ys jagan over english medium
Author
Kakinada, First Published Nov 27, 2019, 3:08 PM IST

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు ప్రముఖ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణ మూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం శుభపరిణామమన్నారు.  

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న సీఎం జగన్ నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. జగన్ కు హ్యాట్సాఫ్ అంటూ పొగిడేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆర్ నారాయణ మూర్తి జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఎంతో ఆదర్శవంతమైనవంటూ అభిప్రాయపడ్డారు. 

తెలుగు భాష కాపాడమంటున్న వారి ఇళ్లలో ఇంగ్లీష్‌ మాట్లాడుకుంటున్నారని ఇదంతా ఎవరికీ తెలియని విషయం కాదన్నారు. మాతృభాషలో విద్యాబోధన జరగాలంటున్న కొంతమంది వాళ్ల పిల్లల్ని మాత్రం కార‍్పొరేట్‌ సూళ్లలో చదివిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

తమ తరంలో ఇంగ్లీష్‌ మీడియంలో చదివినవాళ్లు ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలుగు మీడియంలో చదివితే బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్యూన్లు, బంట్రోతులు మాత్రమే అవుతారని ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయింది. వచ్చే ఏడాది నుంచే తరగతులు ఇంగ్లీషు మీడియంలో ప్రారంభించేలా జీవోను సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై పలు రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు సైతం ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

రాజకీయ విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సీఎం వైయస్ జగన్ అండ్ కో. పేదవాళ్ల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువుకోవద్దా మీ పిల్లలే చదువుకోవాలా అంటూ చీవాట్లు పెట్టారు. ఇంగ్లీషు మీడియంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారి కుటుంబ సభ్యులు చదివిన మీడియాన్ని సైతం బయటకు తీసి వారికి చుక్కలు చూపించారు సీఎం జగన్. 

Follow Us:
Download App:
  • android
  • ios