హైదరాబాద్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై సినీనటుడు పోసాని కృష్ణమురళీ స్పందించారు. ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యదల్చుకోలేదన్నారు. 

ప్రజలకు సేవ చెయ్యాలన్న కోరిక ఉందని అయితే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందండం అదంతా నావల్ల కాదన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు సేవ చెయ్యాలన్నదే తన అభిమతమన్నారు. తనకు పదవులు అవసరం లేదన్నారు. తాను ఏ పార్టీని ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని ఏనాడు అడగ లేదన్నారు. 

తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్నారు. తాను కోరుకునేది ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాలనని చెప్పుకొచ్చారు. గతంతో తాను ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసించానని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా ప్రశంసించానని ఇప్పుడు వైఎస్ జగన్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు. 

ఇకపోతే 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన పోసాని కృష్ణ మురళీ గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

ఇటీవల కాలంలో మళ్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టి అని చూడకుంటా ఉతికి ఆరేస్తున్నారు. అయితే ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సమయంలో ఆయన్ను కలిశారు. జగన్ ను అభినందించారు. అయితే వైసీపీలో మాత్రం చేరలేదు.