తెలంగాణ ఇంటర్ ఫలితాల గందరగోళం కారణంగా.. పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనలపై సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు తాజాగా స్పందించారు.

తెలంగాణలో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తన మనసు కలచివేసిందని ఆయన అన్నారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులను శక్షించొద్దని ఆయన కోరారు. ఈ మేరకు మోహన్ బాబు ఓ ప్రకటనను విడుదల చేశారు.

‘‘భగవంతుడు జన్మనిచ్చింది ఆఖరి శ్వాస వరకూ జీవించడానికి.., ఆ జీవితాన్ని మార్కులు రాలేదనో, పరీక్షలో తప్పామనో ముగించుకుంటే తల్లిదండ్రులు, స్నేహితులు,  సన్నిహితులు, బంధువులు తల్లడిల్లిపోతారు. ఇది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఒక విద్యాసంస్థ అధినేతగా వేల మంది విద్యార్థుల్ని అనుక్షణం నీడలా అనుసరిస్తూ, వాళ్లకు మనోనిబ్బరాన్ని కలిగిస్తున్న నాకు తెలంగాణలో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేసింది. ప్రభుత్వం స్పందించింది.. తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది. ఈలోపు దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని.. మీ తల్లిదండ్రులను శక్షించకండి’’ అని పేర్కొన్నారు.