విజయవాడ: పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రధాని నరేంద్రమోదీ ఏపీ ప్రజలకు ఇచ్చిన గొప్ప వరమని బీజేపీ నేత సినీనటుడు కృష్ణం రాజు స్పష్టం చేశారు. మోదీ వాస్తవాలు చెప్తారనే భయంతోనే టీడీపీ నేతలు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 65శాతం నిధులు కేంద్రమే ఇచ్చిందని స్పష్టం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రధాని మోదీ పర్యటన విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఏపీకి ఏమిచ్చారో ప్రధాని మోదీని స్వయంగా చెప్పబోతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ బీసీ అయిన మోదీని దించేస్తామనడం వింతగా ఉందన్నారు. 

చంద్రబాబు నాయుడు కుయుక్తులను ప్రజలు నమ్మరని ధ్వజమెత్తారు. సభలను అడ్డుకున్నంత మాత్రాన వాస్తవాలు దాయలేరు కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి ఏం చేశారో ఆ నిధులు ఏమయ్యాయో త్వరలోనే తేలనుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు హెచ్చరించారు.