హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి. వైయస్ జగన్ ను తాను తొమ్మిది సంవత్సరాలుగా ఫాలో అవుతున్నట్లు తెలిపారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఇద్దరమే ఉన్నామని వారిలో రోజా, తాను అని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్, ఆయన తల్లి వైయస్ విజయమ్మ తమ ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వైసీపీ తరపున కడపలో పోటీ చేసినప్పుడు వారి తరపున తాను ప్రచారం చేశానని గుర్తు చేశారు. 

వారం రోజులపాటు కడపలో ఉండి అనంతరం హైదరాబాద్ వచ్చినట్లు పోసాని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నదే తన లక్ష్యమన్నారు. వైయస్ జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న పోసాని ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో జగన్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చారు. 

వైయస్ జగన్ పై ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు విమర్శలు చేస్తే తాను హైదరాబాద్ లో ఉంటూ సమాధానం చెప్పేవాడినని తెలిపారు. వైయస్ జగన్ కు ఏదో చేయాలని తాను భావించానని అందుకు ఉడతాభక్తిగా కొన్ని చేసినట్లు తెలిపారు.  

ఎన్నికలకు ముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు తనను సంప్రదించినట్లు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక రాజ్యసభకు వెళ్తారా అంటూ ఆఫర్లు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. 

తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని జగన్ పై అభిమానంతో తాను పనిచేస్తానని చెప్పినట్లు పోసాని గుర్తు చేశారు. వాలంటీర్ గానే తాను పార్టీ కోసం పనిచేసినట్లు తెలిపారు. అనంతరం వైయస్ జగన్ అధికారంలోకి రావడం సీఎం అవ్వడం అంతకు మించి ఆనందం ఇంకేమీ లేదన్నారు. 

అయితే వైయస్ జగన్ పిలిచి పదవి ఇస్తే తాను చేస్తానని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రజలకు, ప్రభుత్వాలకు ఉపయోగపడే బాధ్యత ఏది ఇచ్చినా నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. అంతేకానీ పదవుల కోసం తాను దాసోహపడనని చెప్పుకొచ్చారు. 

తాను సినీ ఇండస్ట్రీలో గానీ, బయట గానీ తాను ఎప్పుడూ అడుక్కోలేదన్నారు. తనను గుర్తించి పని అప్పగిస్తే అది తాను చిత్తశుద్దితో నెరవేర్చానని చెప్పుకొచ్చారు. అంతేగానీ పదవుల కోసం ఎగబడటం తనకు చేతకాదన్నారు. 

తనకంటే పార్టీలో జూనియర్ నటులకు పదవులపై అశలు ఉండొచ్చన్నారు. వారు పార్టీ కోసం తనకంటే బాగా కష్టపడి పనిచేసి ఉండొచ్చని ఫలితంగా వారికి పదవులు వచ్చి ఉండొచ్చన్నారు. తాను అడగలేదు కాబట్టే తనకు పదవులు రాలేదని చెప్పుకొచ్చారు. 

1983 నుంచి తాను ఇప్పటి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని వారిలో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అద్భుతంగా పనిచేశారని చెప్పుకొచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో సీఎం వైయస్ జగన్ పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఇప్పట్లో చనిపోను, రాజకీయాల్లో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయ్: పోసాని కృష్ణమురళి