హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు అలీ రాజకీయాల్లోకి రాబోతున్నారా...? వైసీపీలో చేరాలా లేక జనసేనలో చేరాలా లేకపోతే తనకు నచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరాలా అన్న సందేహంలో ఉన్న అలీ ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నారా...? ఇక సైకిలెక్కేసేందుకు రెడీగా ఉన్నారా...? రెండుసార్లు చంద్రబాబు నాయుడును కలిసి చర్చించింది అందుకేనా.

అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అలీ రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారని అయితే తన సొంత జిల్లా అయిన తూర్పుగోదావరి నుంచి కాకుండా గుంటూరు జిల్లా నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. 

అలీ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచెయ్యాలని తన మనసులోని మాటను చంద్రబాబు చెవిలో చెప్పినట్లు ప్రచారం. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో అలీ అభ్యర్థిత్వంపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.  

ముస్లిం సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతోపాటు సినీ గ్లామర్ అలీ గెలుపుకు దోహదపడుతుందని భావించిన చంద్రబాబునాయుడు అలీ అభ్యర్థిత్వానికి దాదాపు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం అలీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ చంద్రబాబుతో రాయబారం నడిపారని తెలుస్తోంది. 

ఇకపోతే నియోజకవర్గంలో బలబలాలను అంచనావేస్తే ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి మహ్మద్ ముస్తఫా షేక్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈయన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎం గిరిధర్ పై నాలుగువేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.  

ఇదే నియోకజవర్గం నుంచి 2009లో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన షేక్ మస్తాన్ వలి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి షేక షౌకత్ పై తొమ్మిది వేల ఒట్లు మెజారిటీతో గెలుపొందారు.  

ఇకపోతే ఈ నియోజకవర్గం నుంచి ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన నేతలు విజయకేతనం ఎగురవేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరుపున రెండు సార్లు షేక్ జియావుద్దీన్ గెలుపొందగా గత రెండు పర్యాయాలుగా కాంగ్రెస్ ఒకసారి వైసీపీ మరోసారి విజయకేతనం ఎగురవేశాయి. 

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు ఎక్కువ. అభ్యర్థి గెలుపు ఓటములను నిర్ణయించేది ముస్లిం మైనారిటీలే. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎం.గిరిధర్ పోటీ చేసి ముస్తఫా షేక్ చేతిలో ఓటమి చెందారు. 

ఈసారి ఎలాగైనా గుంటూరు తూర్పులో తెలుగుదేశం జెండా ఎగురవెయ్యాలని చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ హాస్యనటుడు ఆలీకి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అలీకి బంధువులు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. 

ఇకపోతే అలీ ఇప్పటికే రెండు సార్లు సిఎం నారాచంద్రబాబు నాయుడిని కలిశారు. దాదాపు 20 రోజుల క్రితం ప్రముఖ సినీ నిర్మాత సి.అశ్వనిదత్ తో కలిసి చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత ఈనెల 20న ఆదివారం తన భార్యతో కలిసి చంద్రబాబును కలిశారు. 

తాను తెలుగుదేశంలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అలీకి ఉన్నబంధుగణం, ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి అలీ గ్లామర్ పనికొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీకి దాదాపు రూట్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.  

మరోవైపు గుంటూరు జెడ్పీ చైర్ ప‌ర్స‌న్‌, మైనార్టీ నాయ‌కురాలు జానీమూన్ సైతం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. ఆమెకు  జిల్లా మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్నాయి. 

ఆమె కూడా గుంటూరు తూర్పు నుంచి పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కవాలని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు అలీకి టిక్కెట్ కన్ఫమ్ చేస్తారా లేక జానీమూన్ కి ఇస్తారా లేక వేరొకరిని బరిలోకి దింపుతారా అన్నది తెలియాలంటే మరోకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.