గుంటూరులో బైక్ దొంగతనాల నిందితుడు అరెస్ట్.. ఐదు బండ్లు స్వాధీనం..
గుంటూరులో ఓ బైక్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిముందు పార్క్ చేసి ఉంటే చాలు చేతివాటం ప్రదర్శిస్తున్న నిందితుడి నుంచి 5 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా : గుంటూరు నగర పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వద్ద నుంచి కొత్తపేట పోలీసులు 5 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గుంటూరు పట్టణానికి చెందిన రిజ్వన్ గా విచారణలో వెల్లడయ్యింది. అర్దరాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ లను, జీజీహెచ్ లో బైక్ లను మారు తాళాలతో దొంగతనాలకు పాల్పడ్డాడు.
నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై.. వాటికోసం దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. బైక్ దొంగతనాలతోపాటు డబ్బుల కోసం ఏటీఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నం చేశాడని సీఐ .శ్రీనివాసుల రెడ్డి తెలిపారు.
ఇదిలా ఉండగా, అక్టోబర్ 25న ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో పోలీసులు అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా ఒకదాన్ని పట్టుకున్నారు. విజయవాడ సీపీ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు జగయ్యపేట్ ఆటోనగర్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు బైకులపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరు ముగ్గురూ కలిసి బైక్ లను దొంగతనం చేసి, అమ్మకుంటూ ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నారని తేలింది.
అలా వీరు ముగ్గురూ ఎన్టీఆర్ జిల్లాలో11, ప్రకాశం జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 15, తెలంగాణ రాష్ట్రంలో 3 మోటార్ సైకిళ్ళు... మొత్తం కలిపి 40 వాహనాలు దొంగతనం చేసినట్లు తేలింది. వీటిలో 19 వాహనాలను కె. అగ్రహారం అట్టల ఫ్యాక్టరీలో దాచినట్లు పోలీసులు గుర్తించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట చెందిన కొమ్మిశెట్టి కోటేశ్వరరావు అనే వ్యక్తికి 20 మోటార్ సైకిళ్ళు అమ్మినట్లు తేలింది. ఆ తరువాత నిందితుల నుంచి మొత్తం 40 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 25 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈకేసు విచారణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందికి విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా అభినందనలు తెలిపారు. రివార్డ్‌లు అందజేశారు.