చిత్తూరు/ విజయనగరం: ప్రధాని నరేంద్ర మోడీ ఉచ్చులో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చిక్కుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బీజేపీ, జనసేన పొత్తు లేకున్నా స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఏ-1, ఏ-2 నిందితులు రమణదీక్షితులతో నీచమైన ఆరోపణలు చేయిస్తున్నారని జగన్, విజయసాయి రెడ్డిలను ఉద్దేశించి ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకుంటే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోతుందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

బీజేపీ మిత్రబంధాన్ని మరచి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మరో మంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. విజయనగరం జిల్లా ఆనంద గజపతి ఆడిటోరియంలో మినీ మహానాడు నిర్వహించారు. రాష్ట్రాన్ని ఆశాస్త్రీయంగా విభజించినందుకు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం ఎలా చెప్పారో,రాబోయే ఎన్నికల్లో బీజేపీకి కూడా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 
వైసీపీ, జనసేనలు బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆయన ఆరోపించారు. వైసీపీ, జనసేనకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సలిన బీజేపీని జగన్ నిలదీశారా అడిగారు.
 
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణ కుటుంబం కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లకు కక్కుర్తి పడి ఏ ప్రాజెక్టు పూర్తిచేయలేదన్నారు. బొత్స అవినీతికి ఉద్యోగులు కూడా బలయ్యారని విమర్శించారు. బొత్స గెస్ట్ పొలిటీషియన్ గా ఆయన అభివర్ణించారు.